వైవిధ్య ప్రేమకథా చిత్రం

A variety love story filmహీరో కావాలన్న తన తనయుడు మారిశెట్టి అఖిల్‌ కలను నెరవేరుస్తూ అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయవేత్త, మారిశెట్టి శ్రీకాంత్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భానుశ్రీ హీరోయిన్‌గా శ్రీధన్‌ దర్శకత్వంలో ఎ.కె.టెక్‌ మార్కెటింగ్‌ మూవీ క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ మంగళవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా, చోడవరం మండలంలోని నిర్మాత సొంత గ్రామమైన లక్ష్మీపురంలోని రామాలయంలో ప్రారంభమైంది. ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత నట్టి కుమార్‌ క్లాప్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘అనకాపల్లి రాజకీయాలలో మంచి పేరున్న మారిశెట్టి శ్రీకాంత్‌ తన కుమారుడి ఆసక్తిని గమనించి, సినిమా నిర్మాణానికి పూనుకోవడం అభినందనీయం’ అని అన్నారు. ‘ఈ సినిమా చిత్రీకరణ అనకాపల్లి చుట్టు పక్కల ఐదు రోజులపాటు జరుగుతుంది. ఇందులో భాగంగా ఒక పాట, ఒక ఫైట్‌ చిత్రీకరణ జరుపుతాం. ఆ తర్వాత హైదరాబాద్‌, విశాఖపట్నం, అరకు తదితర ప్రదేశాలలో షూటింగ్‌ చేస్తాం. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తాం’ అని నిర్మాత మారిశెట్టి శ్రీకాంత్‌ చెప్పారు.
హీరో మారిశెట్టి అఖిల్‌ మాట్లాడుతూ, ‘మొదట్నుంచి నాకు సినిమా రంగమంటే ఎనలేని మక్కువ. హీరో కావాలన్న నా అభిరుచికి మా నాన్న మద్దతు పలికారు. దాంతో నా నటనకు మెరుగులు దిద్దుకునేందుకు అన్నపూర్ణ ఫిలిం యాక్టింగ్‌ స్కూల్‌లో నటనలో శిక్షణ పొందాను. తప్పకుండా ఈ తొలి చిత్రం నా కెరీర్‌ను మలుపు తిప్పుతుందని భావిస్తున్నాను. మంచి కథతో రూపొందుతున్న ఈచిత్రంలో నాపాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది’ అని అన్నారు. దర్శకుడు శ్రీధన్‌ మాట్లాడుతూ, ‘ఇదొక భిన్న ప్రేమకధా చిత్రం. హర్రర్‌, కామెడీ అంశాలతో దీన్ని తెరకెక్కించబోతున్నాం. కథానుగుణంగా ఈచిత్రాన్ని మా నిర్మాత ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నారు. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’ అని తెలిపారు.