నవతెలంగాణ-మంచిర్యాల
ఒకవైపు వికలాంగుల సదరం సర్టిఫికెట్ పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న మంచిర్యాల జిల్లాలో మాత్రం సదరం సర్టిఫికెట్‌లు పొందడానికి వికలాంగుల అరిగోస పడుతున్నారు. స్లాట్ బుకింగ్ చేసుకోవడం నుంచి మొదలు సర్టిఫికెట్ పొందేందుకు వికలాంగులు పడే కష్టం అంత ఇంత కాదు.స్లాట్ బుకింగ్ అయినప్పటికీ డాక్టర్‌ల పరీక్షలు, అధికారులు సంతకాలతో ద్రువీకరణ పత్రం పొందాలంటే దాదాపు ఒక్కొకరికి 3 నెలల నుంచి 4 నెలలు పడుతుంది. ఒకవేళ సర్టిఫికెట్ వచ్చిన అది 3 లేదా 5 సంవత్సరాల వరకు పరిమితం కావడంతో తిరిగి సర్టిఫికెట్ పొందాలంటే క్యాంపుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. శారీరకంగా నూటికి నూరు శాతం డిసెబిలిటీ ఉన్నప్పటికీ కొందరు డాక్టర్లు లబ్ధి దారులను పూర్తిగా పరిక్షించకుండనే డిసెబిలిటీ శాతం నమోదు చేస్తున్నారు. లబ్ధి దారులు వాపోతున్నారు. రోజుల తరబడి తిరగ లేక కొందరు అయితే సర్టిఫికెట్ లేకున్నా ఏం కాదులే అనుకొని వదిలేసిన సందర్భాలు ఉన్నట్లు పలువురు చెబుతున్నారు. మంచిర్యాలలో శుక్రవారం జరిగిన ఆర్థో విభాగానికి సంబంధించిన సదరం క్యాంప్‌లో డాక్టర్‌లు సమయానికి రాకపోవడంతో వచ్చిన వికలాంగులు డాక్టర్‌ల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ధ్రువీకరణ పత్రం వచ్చినా పింఛన్ రాకపోవడంతో మరి కొందరు అధికారులను కలిసేందుకు బారులు తీరారు. సమయానికి రాని డాక్టర్‌లు, లబ్ది దారులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో తలెత్తే సమస్యలపై మంచిర్యాల ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ హరీష్ చంద్రరెడ్డిని వివరణ కోరగా స్లాట్ బుకింగ్ చేసుకొని వచ్చిన వికలాంగుల వివరాలు నమోదు చేసే వరకు సమయం పడుతుంది. అంత సిద్ధం అయిన డాక్టర్లు వచ్చి పరిక్షిస్తారు. వికలాంగులను పరీక్షించే క్రమంలో డాక్టర్‌లు చాక చక్యంగా వ్యవహరిస్తారని, ఎటువంటి లోటు పాట్లు జరిగే అవకాశాలు లేవని తెలిపారు.
పుట్తుకతోనే వైకల్యం ఉంది
కునారపు లక్ష్మి, వికలాంగుడి(తల్లి), ఇంధనపెల్లి.
బాబు పుట్టుడే అంగవైకల్యంతో పుట్టాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగిన బాబు మంచిగా కాడని చెప్పారు. బాబుకు ఇప్పుడు 11 సంవత్సరాలు, బాబుకు రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వికలాంగుల సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే 2019లో ఇచ్చారు. అది కూడా 5 సంవత్సరాలు, మల్లి ఇప్పుడు వచ్చాము. మల్లి గదె 5 సంవత్సరాలకు సర్టిఫికెట్ ఇచ్చారు. అధికారులు, కాళ్లు, చేతులు పడిపోయి లేవలేని స్థితిలో ఉన్నాడు బాబు, అన్నం తినడు, కేవలం పాల తోనే సాదుకుంటున్నాము, శారీరకంగా 100 శాతం సమస్య ఉన్నప్పటికీ సదరం సర్టిఫికెట్‌లో మాత్రం డిసెబిలిటీ శాతం తక్కువగా నమోదు చేయడంతో మల్లి క్యాంప్‌ల చుట్టూ తిరగాల్సి వస్తుంది.