రాళ్లపొలంలో నాగలికట్టి సాలుకిరువాలుగా దున్నుతున్న
రైతన్న సేద్యంమీద
ఎన్ని జీవజాతుల భవిత దాగుందో!..
రోడ్డు పక్కన పండ్ల బండి పెట్టుకుంది ఓ అక్క
అమ్ముడుపోనీ పండ్లవైపు చూస్తున్నప్పుడు
ఆ కళ్లలో ఎన్ని ఆకలి కావ్యాలో లిఖించబడ్తాయో..
నెత్తిమీద కూరగాయల గంప మోస్తున్న ఆమెపై
ఎంత మంది సన్నపిల్లల డొక్కలు ఆధారపడ్డయో..
సంతలో పాత చీరల మూట అమ్ముడుబోతేనే
సాయబు ఆకలి తీరుతది లేదంటే
ఆ చీరలే ఉరితాళ్ళుగా మారుతాయోనని
ఆ సంతలో ఎన్ని ద్ణుఖపువాగులు పారెనో..
ప్రభుత్వ కొలువుకోసం
గ్రంథాలయాలలో అర్థరాత్రి దాకా
చదివే నిరుద్యోగి ఉద్యోగంపై
ఏ తల్లిదండ్రుల
కలలపంటలు దాగున్నాయో..
వరి కోతకు వంగి వంగి లేసి చూస్తూ
బబ్బలుపోయిన అమ్మ రెక్కలపై
ఏ బిడ్డ బంగారు భవిష్యత్తు దాయబడిందో..!
బస్తాలమీద బస్తాలు మోసి
దేహంపై చెమట నది పారిస్తున్న నడుములపై
ఏ కన్న కొడుకు బత్కు రూపుదిద్దుకుంటుందో..!
పేదలకు రెక్కలే ఆస్తులు
ఆ రెక్కలమీదనే బత్కుదెరువుకు
పునాదులు తవ్వుకుంటారు..
-అవనిశ్రీ,
9985419424.