మోడీ బొమ్మతో కష్టమే

Difficulty with Modi doll– కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో స్పష్టం
– అసెంబ్లీ ఎన్నికల్లో భయపడుతున్న బీజేపీ రాష్ట్ర శాఖలు
–  కేంద్రంపై వ్యతిరేకత కూడా ప్రభావం చూపే అవకాశం : రాజకీయ విశ్లేషకుల వెల్లడి
మోడీ, షా ల చేతిలో పార్టీ ఉన్నంత కాలం రాష్ట్రాల్లో ఆ పార్టీ నుంచి బలమైన నాయకులు వచ్చే అవకాశం ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు.. భవిష్యత్తులో జరగబోయే ఆయా ఎన్నికల్లో సైతం బీజేపీకి ఇది తీరని నష్టాన్ని చేకూరుస్తందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులను కేంద్ర దర్యాప్తు సంస్థలతో కట్టడి చేసే ప్రయత్నాన్ని మానుకొని.. ప్రజల ఆశీర్వాదాన్ని పొందే ప్రయత్నాన్ని బీజేపీ చేయాలని వారు అంటున్నారు.
న్యూఢిల్లీ : తాము మిగతా పార్టీల కంటే భిన్నమనీ, తమ పార్టీకి ఒక సిద్ధాంతం ఉన్నదని బీజేపీ నాయకులు తరచూ చెప్పుకునే మాట. పార్టీలో రాజకీయాలు వ్యక్తుల చుట్టూ తిరగవని వారు అంటుంటారు. అయితే, ప్రస్తుత మోడీ-షా నేతృత్వంలోని పార్టీ అందుకు భిన్నంగా ఉన్నది. పార్టీలో మోడీ, షా లు ఇద్దరే అన్నీ తామైనట్టు వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తీరు మరింత స్పష్టమవుతున్నది. రాష్ట్ర స్థాయి నాయకులను కాదనీ.. మోడీ, షాలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారాలు, బహిరంగ సభలు పెడుతూ అంతా తామేనన్నట్టు వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అయితే.. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ, షాల ప్రచారాలు ఏ మాత్రమూ పని చేయటం లేదనీ, పలు ఎన్నికల్లో ఇది స్పష్టమైందని తెలుపుతున్నారు. ఇందుకు వారు ఈ ఏడాదిలో ముగిసిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను ఉదహరిస్తున్నారు. కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నది. ఐదేండ్ల బీజేపీ పాలనపై ఎన్నడూ లేని అసంతృప్తి వ్యక్తమైంది. ఈ తరుణంలో బీజేపీ తరఫున ప్రచార బాధ్యతను తన భుజాలపై వేసుకొని ప్రధాని మోడీ రంగంలోకి దిగారు. రాష్ట్రమంతా తిరిగి ప్రచారాన్ని నిర్వహించారు. ఇందుకోసం బీజేపీ తన ఆయుధమైన హిందూత్వను భారీ స్థాయిలో సైతం వినియోగించింది. ‘బజరంగబలి’ అంటూ మోడీ హిందూ, ముస్లిం ఓట్లను చీల్చే ప్రయత్నాన్నీ చేశారు. అయితే, కర్నాటక ఎన్నికల్లో అవేమీ పని చేయలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ దారుణ ఓటమిని చవి చూసింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ చరిత్రను తిరగరాస్తూ భారీ విజయాన్ని అందుకున్నది. కర్నాటక ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ శాఖలకు భయాన్ని పుట్టిస్తున్నాయి. మోడీ బొమ్మను పెట్టుకొని ప్రచారం చేసినా.. సాక్షాత్తూ ఆయనే వచ్చి ప్రచారాం చేసినా ఎలాంటి ప్రయోజనమూ ఉండదనీ, పైగా ఇంకా నష్టమే ఎదరయ్యే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ”మోడీ, షా, యోగి.. ఇలా ఎవరు ప్రచారం చేసినా కర్నాటకలో ప్రజలను ఆకర్షించలేకపోయారు. అక్కడ బీజేపీ దారుణ ఓటమిని చూసింది. మోడీ, షా తో పాటు ఇతర కేంద్ర నాయకుల ప్రచారమూ అంత ప్రయోజనాన్ని చేకూర్చకపోవచ్చు. పైగా.. కేంద్రంలోని మోడీ సర్కారుపై ఉన్న వ్యతిరేకత.. వారి ప్రచారంతో తమపై పడే ప్రమాదం ఉన్నదని ఆయా రాష్ట్రాల శాఖలు భయపడుతున్నాయి” అని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. మోడీ ఎంతో గొప్పగా చెప్పుకునే డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ప్రచారం ఏ మాత్రమూ పని చేయదని చెప్తున్నారు.