– వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ-సిటీబ్యూరో/కేపీహెచ్‌బీ
రాష్ట్ర ప్రజలకు త్వరలో డిజిటల్ హెల్త్ కార్డులను అందిస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యానగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 150 పడకల ప్రసాద్ ఆస్పత్రిని ఆదివారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. పేదలకు మెరుగైన వేద్య సేవలు అందించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఆస్పత్రుల్లో ప్రమాణాలు, మౌలిక సదుపాయాల కల్పన, సిబ్బంది నియామకాలను చేపట్టనున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్య, వైద్య, ఆరోగ్య భద్రతను అందిస్తున్నామని చెప్పారు. తమ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా ఆరోగ్యశ్రీ పథకం పరిధిని రూ.10 లక్షలకు పెంచినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.