– 60 శాతం నగదు లావాదేవీలే..
– ఆర్‌బీఐ రిపోర్ట్
న్యూఢిల్లీ : కరోనా తర్వాత భారత్‌లో డిజిటల్ చెల్లింపులు అత్యంత వేగంగా పెరిగిపోయాయి. గడిచిన మూడేండ్లలోనే రెట్టింపు అయ్యాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. అయినప్పటికీ.. ఇప్పటికీ నగదు చెల్లింపుల లావాదేవీలు 60 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఆర్‌బీఐ రిపోర్ట్ ప్రకారం..2021 మార్చి ముగింపు నాటికి డిజిటల్ చెల్లింపుల వాటా 14-19 శాతంగా ఉండగా.. 2024 మార్చి నాటికి 40-48 శాతానికి ఎగిశాయి. ఇదే సమయంలో నగదు వినియోగం భారీగానే నమోదయ్యిందని ఆర్‌బిఐ కరెన్సీ మేనేజ్‌మెంట్ విభాగానికి చెందిన ప్రదీప్ భుయాన్ తెలిపారు. 2021 జనవరి-మార్చి కాలంలో ప్రయివేటు వినిమయంలో నగదు వాటా 81-86 శాతంగా ఉందన్నారు. 2024 జనవరి- మార్చి కాలంలో 52-60 శాతంగా నమోదయ్యిందన్నారు.
మోడీ సర్కార్ 2016లో పెద్ద నోట్ల పేరుతో రూ.500, రూ. 1000 నోట్ల రద్దు చేసిన సమయంలో యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చెల్లింపుల విధానం ప్రారంభమైంది. 2020 కరోనా సమయంలో ఈ చెల్లింపులు మరింత ఊపందుకున్నాయి. 2016-17లో రూ.3,872గా ఉన్న సగటు డిజిటల్ చెల్లింపులు.. 2023-24 నాటికి ఈ సగటు రూ.1,525కు తగ్గినప్పటికీ.. స్థూలంగా చెల్లింపులు అమాంతం పెరిగాయి. ఇది చిన్న విలువ కొనుగోళ్లకు పెరుగుతున్న వినియోగాన్ని సూచిస్తుంది. విలువ పరంగా 2021లో 33 శాతం వాటా కలిగిన డిజిటల్ చెల్లింపులు.. సంఖ్యా పరంగా యూపీఐ చెల్లింపులు 51 శాతం నుంచి 87 శాతానికి పెరిగాయి.