డిజిటల్‌ ట్రోల్స్‌ – డేంజర్‌ బెల్స్‌

Digital Trolls - Danger Bells‘పిచ్చోడి చేతిలో రాయి..అది ఏడ తగులుతుందో తెలియదోయి’ అన్నాడో కవి. మతోన్మాది చేతిలో డిజిటల్‌ మీడియా అది ఎన్ని దారుణాలకు తెగబడుతుందో గమనించి అలెర్టవ్వాల్సిన సందర్భమిది. హైదరాబాద్‌ నడిబొడ్డున జరిగిన జాతీయ బుక్‌ ఫెయిర్‌ సాక్షిగా ఒక కుట్ర బట్టబయలైంది. బుక్‌ ఫెయిర్‌ చివరి రోజు ‘వీక్షణం’ స్టాల్‌కు వచ్చాడో అగంతకుడు. సెల్‌ఫోన్‌ కెమెరా ఆన్‌చేసి, ప్రముఖ జర్నలిస్ట్‌, రచయిత వేణుగోపాల్‌ గారిని ట్రిగ్గర్‌ చేశాడు. ‘హిందూ ధర్మాన్ని కించపరిచేటట్లు ఉన్న బుక్‌, మీరెట్ల అమ్ముతారు? మీరు హిందుత్వాన్ని కించపరుస్తారా? మీ పేరేంటి? మీరు హిందూమతాన్ని పాటిస్తారా, పాటించరా?’ ఇలా వాదనకు దిగాడు ఆ ట్రోలర్‌. అన్ని ప్రశ్నలకు టకాటక్‌ సమాధానాలు ఇస్తూ పోయాడు వేణుగోపాల్‌. కానీ వచ్చిన వ్యక్తి ఎవరు? ఎందుకొచ్చాడు? ఎందుకు వీడియో తీస్తున్నాడు? అతనికెందుకు సమాధానం చెప్పాలి? ఆ వీడియోను ఏం చేస్తాడు? అని వేణుగోపాల్‌తో పాటు అక్కడివారెవ్వరూ అంచనా కట్టలేదు. ఆ వీడియోతో పాటు వేణుగోపాల్‌ ఫోన్‌ నెంబర్‌ను జోడించి, సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. నాలుగైదు రోజులుగా వందలాది ఫోన్లు. బెదిరింపులు, తిట్లు. ఈ క్రనాలజీని పరిశీలిస్తే అప్పటికప్పుడు తీసిన వీడియో అనుకోవాలా? కాన్స్పిరసీ లేదనుకోవడానికి వీలుందా? ఇది పక్కా వెల్‌ డిజైన్డ్‌ డిజిటల్‌ మూకదాడి, కాదనగలమా!
ప్రజాకవి జయరాజుపైన జరిగింది కూడా సరిగ్గా ఇలాంటిదే. ఒకరోజు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ప్రశ్నలడుగుతుంటే జయరాజు హుందాగా సమాధానాలిస్తూ పోయాడు. క్రమంగా వాగ్వాదానికి దిగాడా కుట్రదారు. కొంత సమయం ఓపిక పట్టి గట్టి క్లాస్‌ తీసుకున్నాడు జయరాజు. ఆ కాల్‌ రికార్డు చేసి, తమకు అనుకూలంగా ఉన్న భాగాన్ని ఎడిట్‌ చేశారు. వీడియోతో పాటు జయరాజు ఫోన్‌ నంబర్‌నూ వైరల్‌ చేశారు. ఇంకేముంది? వందలాది ఫోన్లు, మెసేజీలు. పోలీసులను ఆశ్రయించినా పెద్దగా ప్రయోజనం జరగలేదు. ప్రజాస్వామిక గొంతులన్నీ ఏకమై కవి జయరాజుకు మద్దతుగా రౌండ్‌ టేబుల్స్‌, సోషల్‌ మీడియాలో ఒక క్యాంపెయిన్‌ జరిపితేగానీ ట్రోల్స్‌ సద్దుమణగలేదు. సాహితీవేత్త కత్తి పద్మారావుపైనా డిజిటల్‌ మూకదాడి మరో రూపంలో జరిగింది. యూట్యూబ్‌ ఛానెల్స్‌ను అడ్డం పెట్టుకున్న ఒక మతోన్మాద ముఠా, ఆయన ఏదో సందర్భంలో మాట్లాడిన వీడియో నుండి చిన్న బిట్‌ కట్‌ చేసింది. ఆ వీడియోను చూపిస్తూ బూతు పురాణానికి దిగింది. అవమానకర రీతిలో ట్రోల్‌ చేసింది. ప్రజాస్వామిక శక్తులన్నీ ఏకమై, కత్తి పద్మారావుకు మద్దతుగా గొంతు కలిపితేనే ట్రోలింగ్‌ ఆగింది. యాక్టివిస్టులు బైరి నరేష్‌, రెంజర్ల రాజేష్‌ మాట్లాడిన సుదీర్ఘ స్పీచ్‌లలో కొన్ని ముక్కలు కట్‌చేసి అతికించి తప్పుడు అర్థాలు వచ్చేట్లు ఎడిట్‌ చేసి వైరల్‌ చేశారు. వైరలవుతున్న వీడియో నిజమా, అబద్దమా అని నిర్థారించే తీరిక, ఓపిక లేకుండా పోయింది ప్రముఖ టీవీ ఛానెల్స్‌వారికి. తప్పుడు వీడియోలనే రిపీటెడ్‌గా ప్లేచేశారు. దీంతో ఉత్తర భారతదేశ మూకదాడుల విష సంస్కృతి తెలంగాణలో స్వైరవిహారం చేసింది. సినీఫక్కీలో పోలీసు వాహనాన్ని చేజ్‌ చేసి అందులో ఉన్న బైరి నరేష్‌పై మూకదాడి చేసింది. పోలీసు వాహనంలోనే హత్యాయత్నం జరిగితే, ఒక్కరోజులోనే ఉన్మాదులకు బెయిల్‌ దొరికింది. ఆ క్రమంలోనే నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లికార్జున్‌ మరికొంతమందిపై వరుస మూక దాడులు జరిగాయి. అప్పుడు తెలంగాణ సమాజమంతా ఏకతాటిపైకి వచ్చి 120 సంఘాలతో స్వేచ్ఛా జాక్‌ ఏర్పాటు చేసింది. రౌండ్‌ టేబుల్‌ సమావేశాలతో అండగా నిలిచి, ఘటనా స్థలాలకు, బాధితుల వద్దకు నేరుగా వెళ్లి ధైర్యాన్ని చెప్పింది. పరిస్థితి మరింత అదుపు తప్పకుండా కట్టడిచేసింది ఐక్య కార్యాచరణే.
జర్నలిస్టులనూ విడిచిపెట్టలేదు వాట్సాప్‌ యూనివర్సిటీ. ప్రొ నాగేశ్వర్‌, తెలకపల్లి రవి, జర్నలిస్టు తులసి చందు, మహువా మీడియా, టి10, ఎన్‌9 మీడియా లాంటి అభ్యుదయ ఛానెల్స్‌ను టార్గెట్‌ చేసింది. వీడియోలు, పోస్టుల కింద బూతు కామెంట్లు రాసింది. రిపోర్టులు కొట్టించింది. ఒక దశలో ఈ ట్రోల్స్‌ భరించలేక తులసి చందు బయటికొచ్చి ‘నన్ను చంపినా నా ప్రశ్న ఆగదు’ అంటూ.. ఒక బహిరంగ లేఖను రాసింది. తెలుగు సమాజం ఆమెకు మద్దతుగా నిలిచింది. ఇలా కేవలం నలుగురైదుగురితో మాత్రమే ఆగలేదు. యాక్టివిస్ట్‌ దేవి, పివోడబ్ల్యూ సంధ్య, విజ్ఞాన దర్శిని రమేష్‌, బాబుగోగినేని, ప్రొ.సూరేపల్లి సుజాత, మెర్సీ మార్గరేట్‌, జిలుకర శ్రీనివాస్‌, పసునూరి రవీందర్‌, దిగంబర్‌ కాంబ్లే, కవులు, కళాకారులపై ట్రోల్స్‌ మూక ఎగబడింది. ప్రశ్నించే ప్రతిగొంతు ఏదో ఒక సందర్భంలో టార్గెట్‌ చేయబడి ట్రోల్స్‌కు గురయ్యింది. వాట్సాప్‌ యూనివర్సిటీ సైన్యాన్ని రంగంలోకి దింపుతుంది. ఒక్కొక్కరినీ ఒంటరిని చేసి ట్రోల్స్‌ చేస్తోంది. పర్సనల్‌ అబ్యూజ్‌, క్యారెక్టర్‌ అసాసినేషన్‌ చేస్తూ, ఫ్యామిలీ మెంబర్లనూ బూతులు తిడుతుంది. ఫోన్‌ నెంబర్లను వైరల్‌ చేస్తూ, బెదిరిస్తూ, భయపెడుతూ పౌర సమాజంలోనే వారిని వేరుగా చూసేలా తీవ్ర ప్రయత్నం చేస్తోంది.
ఈ డిజిటల్‌ మూకదాడులు భౌతికదాడులకూ పురిగొల్పుతున్నాయి. దాడులు కాకతాళీయంగా జరగుతున్నవి కావు. వారి సైద్ధాంతిక పునాదుల్లోంచే వీటిని చూడాలి. వారు ఎంచుకున్న ‘శత్రువర్గం’పైనే వ్యూహాత్మక దాడులు చేస్తున్నాయి. సైన్స్‌ ప్రచారకులు, జర్నలిస్టులు, హేతువాదులు, మానవవాదులు, నాస్తికులు, లెఫ్టిస్టులు, దళితులు, యాక్టివిస్టులు, రచయితలు, అభ్యుదయవాదులే వారి లక్ష్యం. అప్రమత్తంగా, ఐక్యంగా లేకుంటే జరిగే నష్టాన్ని ఊహించలేం, పూరించలేం. అభ్యుదయవాదుల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఉంటాయి కూడా. ట్రోల్స్‌, డిజిటల్‌ మూకదాడుల సమయంలో ఏకతాటిపైకి వచ్చి తిప్పి కొడితేనే తోకముడుస్తున్నారన్న నిజాన్ని గుర్తించాలి. 2025 ప్రారంభంలోనే వేణుగోపాల్‌తో పాటు ‘ఉచ్చల జలధితరంగ’ పుస్తకంలో కవితలు రాసిన పంతొమ్మిది మంది అభ్యుదయ కవుల్ని కూడా టార్గెట్‌ చేస్తూ మతోన్మాదుల క్యాంపెయిన్‌ నడుస్తోందిప్పుడు. కుట్రదారుడే రాజ్యాన్ని నడుపుతున్న సందర్భం. ప్రమాదం ఏవైపునుండి, ఏరూపంలో వస్తుందో! ఏ ఇంటి తలుపుతడుతుందో చెప్పలేం. నేను బానే ఉన్నాననే భ్రమతో కండ్లముందు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకుంటే, ఆ మూకలు నీ, నాదాకా రావడానికి పెద్ద టైం పట్టకపోవచ్చు మిత్రమా. బి అలెర్ట్‌..
శ్రీ సుందర్‌
8498084005