సందిగ్ధం..!

సందిగ్ధం..!– పల్లె పోరుపై ఆశావహుల్లో ఉత్కంఠ
– పంచాయతీ రిజర్వేషన్లపై స్పష్టతనివ్వని ప్రభుత్వం
– ఈ నెల 31తో ముగియనున్న పాలకవర్గాల గడువు
– ప్రత్యేకాధికారుల పాలనకు అవకాశం..!
నవతెలంగాణ-సిటీబ్యూరో
పల్లె పోరుపై సందిగ్ధం నెలకొంది. నెల రోజుల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరోసారి ఎన్నికలకు సమయం రానేవచ్చింది. గ్రామ పంచాయతీ పాలకవర్గాల గడువు సమీపిస్తుండటంతో ఆశావహులు ఇప్పటి నుంచే పోటీకి ఉవ్విళ్లూరుతూ ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే ఇది వరకు ఉన్న రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా.. లేక కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ సర్కారు వాటిని ఏమైనా మారుస్తాందా.. అనే సందిగ్ధం నెలకొంది. అంతేకాదు, పంచాయతీ ఎన్నికలు సమయానికి జరుగుతాయా.. లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు ప్రారంభించాలని ఎన్నికల సంఘం కలెక్టర్లను ఆదేశించింది. ఆశావహులు మాత్రం ఈసారి రిజర్వేషన్లు తమకు అనుకూలంగానే ఉంటాయనే ఉద్దేశంతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనులు మొదలు పెట్టారు.
31తో ముగియనున్న సర్పంచుల పదవీకాలం
గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు ప్రభుత్వం 2019లో ఎన్నికలు నిర్వహించింది. అయితే పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరించిన అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్థానిక సంస్థలైన పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లు, మున్సిపాలిటీలకు కేటాయించిన రిజర్వేషన్లు పదేండ్లపాటు కొనసాగించేలా తీర్మానిస్తూ చట్టాన్ని రూపొందించింది. ఈ మేరకు 30 మార్చి 2018న ప్రభుత్వం దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన పీఆర్‌ యాక్ట్‌ రిజర్వేషన్ల ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికలను 2019 జనవరి 7, 14, 25 తేదీల్లో మూడు విడతలుగా నిర్వహించింది. కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఫిబ్రవరి 2వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 31వ తేదీతో వారి పదవీకాలం ముగియనుంది. దీంతో ఎన్నికల నిర్వహణ అవశ్యకంగా ఏర్పడింది. ఆ దిశగానే ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంటూ గత నెల 5వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలకనుగుణంగా అధికారులు పోలింగ్‌, సిబ్బంది వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ వివరాలను వెబ్‌సైట్‌లో సైతం నమోదు చేయనున్నారు.
ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా..?
మరో 24 రోజుల్లో ప్రస్తుత పంచాయతీ పాలకవర్గాల గడువు ముగియనుండటంతో ఆ లోపు ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా.. అనే ప్రశ్న తలెత్తుతుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో క్షేత్రస్థాయిలోనూ ఎన్నికల కసరత్తు ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఆదేశాలు జారీ చేసినా ఎన్నికల నిర్వహణ నిర్ణీత గడువులోగా సాధ్యమయ్యే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాతనే జరిగే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే జీపీల్లో ప్రత్యేకాధికారుల పాలన వచ్చే అవకాశం కన్పిస్తోంది. ఇది ఎంపీ ఎన్నికల వరకు కొనసాగే అవకాశముంటుందని అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ సభ్యుల పదవీకాలం గడువు వచ్చే ఏడాదితో ముగియనుంది. వీటికి సైతం ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో పంచాయతీ ఎన్నికలతో కలిపే వాటిని నిర్వహిస్తారనే చర్చ కూడా మొదలైంది. అందుకోసం కొత్త ప్రభుత్వం సర్పంచులతోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో పాటు జెడ్పీ చైర్మెన్‌ పదవుల రిజర్వేషన్లు సైతం మారుస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో ఆశావహులు ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలు ప్రారంభించారు. గ్రామస్తులను ఆప్యాయంగా పలుకరిస్తూ వారికి అవసరమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.