విశ్వవిద్యాలయాలపై సన్నగిల్లుతున్న విశ్వాసం

విశ్వవిద్యాలయాలపై సన్నగిల్లుతున్న విశ్వాసందక్షిణాఫ్రికాలోని ఒక విశ్వవిద్యాలయ శిలాఫలకం మీద ఇలా వుంది. ”ఏ దేశమైనా నాశనమవ్వడానికి అణుబాంబులు అక్కర్లేదు. అణ్వస్త్ర ఆయుధాలు అంతకంటే అక్కర్లేదు. ఆ దేశంలో లోపభూయిష్టమైన, నిర్వీర్యమైన విద్యావ్యవస్థ అన్ని వ్యవస్థలను నీచస్థితికి దిగజార్చుతుంది”. నేడు దేశవ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలు విశ్వ విద్యాలయాలలో విద్యా ప్రమాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గణితం, సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌, ఇంగ్లీష్‌లలో పదవ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యం వరుసగా 32 శాతం, 35 శాతం, 37 శాతం, 43 శాతంగా నమోదయ్యాయని ‘నేషనల్‌ అఛీవ్‌మెంట్‌ సర్వే’ పేర్కొన్నది. 2017 నాటి జాతీయ సర్వేతో పోల్చితే, 2021 సర్వేలో సగటు ఫలితాలు పడిపోయాయని తెలిపింది. తమిళనాడు, తెలంగాణ, మేఘాలయ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో జాతీయ సగటు కన్నా దిగువన ఫలితాలు నమోద య్యాయి. ముఖ్యంగా కరోనా సంక్షోభం విద్యార్థుల చదువుల్ని కకావికలం చేసింది. సామాజికంగా, ఆర్థికంగా మెరుగైన కుటుంబాల పిల్లలకు ఆన్‌లైన్‌ చదువులు అందుబాటులో ఉన్నాయని, మిగతావారికి కష్టసాధ్యమైందని సర్వే ఫలితాలు తెలిపాయి. ఆన్‌లైన్‌ ద్వారా సమాన విద్యావకాశాలు పూర్తిగా సన్నగిల్లాయని సర్వేలు చెబుతున్నా దిద్దుబాటు చర్యలకు ప్రభుత్వాలు పూనుకోవడం లేదు. భాషా నైపుణ్యం, పర్యావరణ శాస్త్రం, సైన్సు, గణితం, సామాజిక శాస్త్రాలలో పిల్లలు వెనుకబడ్డారు. తాజాగా కాగ్‌ నివేదిక ఆసక్తికర అంశాలను బయట పెట్టింది. ఐఐటి, ఎన్‌ఐటి లలో పీజీ, పిహెచ్‌డి కోర్సుల్లో ఏటా సీట్లు భారీగా మిగిలి పోతున్నాయని వెల్లడించింది.
ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో పరిశోధన పడకేసి దశాబ్దం అవుతున్నది. ప్రతి సంవత్సరం నిర్వహించాల్సిన రీసెట్‌ ఎంట్రన్స్‌ పరీక్ష మూడేండ్లకోసారి నిర్వహిస్తూ ఇంటర్వ్యూలు అడ్మిషన్లకు సంవత్సర కాలం తీసుకుంటున్నారు. చాలా విశ్వవిద్యాలయాలలో అధ్యాపకులు లేక విభాగాలు మూసివేశారు. నకిలీ విశ్వవిద్యాలయాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. 2020లో అడ్మిట్‌ అయిన స్కాలర్‌కు 2022 పట్టా ఇస్తున్నారు. విశ్వవిద్యాలయంలో కంప్యూటర్‌, ఎంబిఏ విభాగాలలో చదువు చెప్పేవారే లేరు. బాసరలో వెలసిన ట్రిపుల్‌ ఐఐటి పరిస్థితి ఎలా ఉందో అనంతపురంలో వెలసిన కేంద్ర విశ్వవిద్యాలయం పరిస్థితి అలాగే ఉంది. అక్కడ వి.సి, అధ్యాపకులు లేరు. మౌలిక సదుపాయాలు లేవు. ఇక్కడ కేంద్ర విశ్వవిద్యాలయం పెట్టి ఏడేండ్లు కావస్తున్నా అద్దె భవనంలోనే ఉంది. అక్కడ ఉన్న శాతవాహన, తెలంగాణ, మహాత్మా గాంధీ, కాకతీయ విశ్వవిద్యాలయాలలో పట్టుమని పది మంది శాశ్వత అధ్యాపకులు లేరు. చివరికి వంద సంవత్సరాల ఘన కీర్తి ఉన్న ఉస్మానియాలో అరవై మంది అధ్యాపకులు లేరు. ఆంధ్రాలో వెలసిన నన్నయ్య, యోగి వేమన, ద్రావిడ, అంబేద్కర్‌, విక్రమ్‌ సింహపురి, పద్మావతీ, రాయలసీమ విశ్వ విద్యాలయాలలో పట్టుమని పదిమంది శాశ్వత అధ్యాపకులు కూడా లేరు. అధ్యాపకులు లేక కీలక విభాగాలు మూసివేతకు గురైనాయి. పొలిటికల్‌ సైన్స్‌, పాలిమర్‌ సైన్స్‌, స్టాటిస్టిక్స్‌, సెరికల్చర్‌, జువాలజీ, బయో కెమిస్ట్రీ, ఇంగ్లీష్‌, తెలుగు, హిందీ, ఎకనామిక్స్‌, హిస్టరీ, సోషల్‌ వర్క్‌, రూరల్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఎకనామిక్స్‌, జియాలజీ, మ్యాథమెటిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విభాగాల్లోను ఒకే ఒక్కరితో నడుపుతున్నారు.
ఇక్కడ పని చేసే శాశ్వత అధ్యాపకులు మైనర్‌, మేజర్‌ రీసర్చ్‌ ప్రాజెక్టులకు అప్లై చేసిన పాపాన పోవడం లేదు. రీసర్చ్‌ గ్రాంట్‌ అనేది తెలియని స్థితిలో అధ్యాపకులు ఉన్నారు. రీసర్చ్‌ గ్రాంట్లే కాదు కాన్ఫరెన్సులు, సెమినార్‌, ఫ్యాకల్టీ డెంట్‌ ప్రోగ్రాంలకు, స్టాఫ్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులు, రిఫ్రెషర్‌, ఓరియంటేషన్‌ కోర్సులు దశాబ్ద కాలంలో జరగలేదు. అకడమిక్‌ స్టాఫ్‌ కాలేజీలు, ఎలక్ట్రానిక్‌ మల్టీ మీడియా రీసర్చ్‌ సెంటర్లు నిధులు లేక వెలవెలబోతున్నాయి. ఇక ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రానిక్స్‌, జువాలజీ, వృక్ష శాస్త్ర విభాగంలో టెక్నీషియన్లు, ల్యాబ్‌ అటెండర్లు లేక ప్రయోగశాలలు మూతపడ్డాయి.యుజిసి, స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఇతర నియంత్రణ సంస్థల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రయివేటు విశ్వవిద్యాలయాల అడ్డు అదుపు లేకుండా పోయింది. అడుగు వ్యవసాయ భూమి లేకపోయినా అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, ఫారెస్ట్రీ, అగ్రికల్చర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు నడుపుతూ ఎలాంటి గుర్తింపు లేకున్నా విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెడుతున్న విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వాలకు అదుపు లేకుండా పోయింది. కొన్ని నర్సింగ్‌, బీఎస్సీ అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, ఫారెస్ట్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు షాపింగ్‌ కాంప్లెక్స్‌ లోను, కమర్షియల్‌, లాడ్జిలో, అద్దె భవనాలలో ఉంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సువిశాలమైన అత్యాధునిక వసతులతో శాశ్వత భవనాలు అని ప్రచారం చేస్తూ ఏడేండ్లుగా కాలం వెలిబుచ్చుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. బిఎస్సీ అగ్రికల్చర్‌, బిఎస్సీ హార్టికల్చర్‌, బిఎస్సీ ఫారెస్ట్రీ, ఎంబిఏ అగ్రికల్చర్‌…ఏ ఒక్క కోర్సుకు ఐ కార్‌ అనుమతి లేదు.
ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ రీసర్చ్‌ గుర్తింపు ఉండాలంటే కనీసం వంద ఎకరాల వ్యవసాయ భూమి ఉండాలి. ఇలాంటి విశ్వవిద్యాలయాలకు సెంటు భూమి లేదు. కళాశాలలో అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, ఫారెస్ట్రీ కోర్సులు బోధిం చడానికి పట్టుమని నలుగురు అధ్యాపకులు ఉండరు. ప్రయివేటు విశ్వవిద్యాలయాల ఉప కులపతులు, కులపతులు ఎక్కువగా నియంత్రణ మండళ్లల్లో పని చేసి రిటైర్‌ అయిన వారిని నియమించడం జరుగుతుంది. ఎందుకంటే వీరి పరపతి ఉపయోగించి కోర్సులకు అప్రూవల్‌ తెస్తారని ధీమా. ఇలాంటి విశ్వవిద్యాలయంలో మూడేండ్ల విద్యనభ్యసించే విద్యార్థులకు వ్యవసాయంపై కనీస అవగాహన ఉండదు. అగ్రానమి, సాయిల్‌ సైన్స్‌, క్రాప్‌ ప్రొడక్షన్‌, హార్వెస్టింగ్‌, పెస్ట్‌ కంట్రోల్‌, ప్లాంట్‌ పాథాలజీ, వీడ్‌ మేనేజ్‌మెంట్‌, పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌పై అవగాహన లేదు. సుదూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలు ఇలాంటి విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్నారు. మూడు నాలుగేండ్ల తరువాత ఐ కార్‌ గుర్తింపు లేని, వ్యవసాయంపై కనీస అవగాహన లేని విద్యార్థులకు వీళ్లిచ్చే సర్టిఫికెట్‌తో ఎవరికీ ఉద్యోగం రాదు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి విద్యారంగంలో చోటు చేసుకుంటున్న ఇటువంటి అవకతవకలను సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.