– ఆర్‌సీబీ బ్యాటింగ్ కోచ్, మెంటార్‌గా నియామకం
బెంగళూర్ : భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం సరికొత్త అవతారం ఎత్తాడు!. ఇప్పటి వరకు వ్యాఖ్యాతగా మెప్పించిన దినేశ్ కార్తీక్ వచ్చే ఏడాది ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ (ఆర్‌సీబీ)కి బ్యాటింగ్ కోచ్, మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. 39 ఏండ్ల దినేశ్ కార్తీక్ గత ఐపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కోల్‌కత నైట్‌రైడర్స్‌కు సారథ్యం వహించిన అనుభవం దినేశ్ కార్తీక్ సొంతం. ‘ప్రొఫెషనల్ స్థాయిలో కోచ్‌గా బాధ్యతలు తీసుకోనుండటం ఎంతో ఆసక్తిగా ఉంది. నా జీవితంలో సరికొత్త అధ్యాయం పట్ల ఎంతో మక్కువగా ఎదురుచూస్తున్నాను. ఆటగాడిగా నా అనుభవం ఆర్‌సీబీ క్రికెట్ పురోగతికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను’ అని దినేశ్ కార్తీక్ తెలిపాడు.