– సుగంధ ద్రవ్యాల్లో మోతాదుకు మించి క్రిమిసంహారక మందులు
– పది రెట్లు పెంపునకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఏ గ్రీన్‌సిగల్
– ప్రజల ప్రాణాలతో చెలగాటమే..పౌర సంఘాలు
కల్తీలకు కాదేదీ అనర్హం అన్నట్టుగా దందా సాగుతోంది. మనం పైసలు పెట్టి కోనే ఉప్పు,పప్పులే కాదు నూనెలు, సుగంధ ద్రవ్యాలన్నింట్లోనూ కల్తీ యథేచ్ఛగా పారుతోంది. అక్రమార్కులకు కోట్లు కూడబెడుతోంది. జనం ప్రాణాలతో వ్యాపారులు చెలగాటమాడుతున్నా.. మోడీ సర్కార్ మాత్రం కిమ్మర్నాస్తిగా ఉండిపోతోంది. విదేశాలకు పంపిన దేశీయ ఉత్పత్తుల్లో క్రిమిసంహారక మందులు మోతాదుకు మించి ఉన్నాయని తిరస్కరిస్తూంటే.. దేశీయ ప్రజలు మాత్రం ఆ విషాహారాన్ని తిని ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కూడా ఫెస్టిసైడ్ మోతాదు పెంచమని ఉత్తర్వులు ఇస్తే..జనం ప్రాణాలకు బాధ్యులెవరని పౌర సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
న్యూఢిల్లీ : దశాబ్దకాలంగా దేశంలో ఎటు చూసినా కల్తీనే. అక్రమార్కుల భరతం పడతానంటూ అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్..దేశ ప్రజల ఆరోగ్యాల కన్నా..అక్రమ వ్యాపారులకు అండగా నిలుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
పేద,మధ్య తరగతి ప్రజల ఆరోగ్యాలను బేఖాతరు చేస్తున్నదనటానికి తాజా నిదర్శనలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. తినే వస్తువుల్లో కల్తీ కలిపేసుకుని..దండుకోండి..అన్నట్టుగా కేంద్ర వ్యవహరిస్తోంది. ఆ కోణంలోనే.. సుగంధ ద్రవ్యాల్లో పెస్టిసైడ్స్ పరిమాణాన్ని పెంచుతూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) గ్రీన్ సిగల్ ఇచ్చింది. గరిష్ట అవశేష పరిమితి (ఎంఆర్‌ఎల్)ని పది రెట్ల వరకు పెంచింది. ఈ పెరుగుదల కిలోగ్రాము(కేజీ)కు 0.01 మిల్లిగ్రాము(ఎంజీ)ల నుంచి 0.1 ఎంజీకి పెంచింది. ఇది గతంలో అనుమతించిన స్థాయి, పరిమాణం కంటే అధికం కావటం గమనార్హం. ఈ పెరుగుదలపై పలువురు మార్కెట్, ఆరోగ్య నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అధిక మొత్తంలో పెస్టిసైడ్‌ల వినియోగం కారణంగా అది క్యాన్సర్‌కు దారి తీయొచ్చని హెచ్చరిస్తున్నారు.
ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం
ఈ సడలింపు కారణంగా కొన్ని పెద్ద మార్కెట్లలో భారత సుగంధ ద్రవ్యాల ఎగుమతులు ఎక్కువగా తిరస్కరణకు గురవుతాయని పెస్టిసైడ్ యాక్షన్ నెట్‌వర్క్ సీఈఓ దిలీప్ కుమార్ అన్నారు. అలాగే, అధికమొత్తంలోని పెస్టిసైడ్ కలిగి ఉన్న సుగంధద్రవ్యాల దిగుమతి సులభతరం కానున్నదని చెప్పారు. తమకు అందిన పలు విజ్ఞప్తుల ఆధారంగానే పెస్టిసైడ్ పరిమితిని పెంచినట్టు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. అయితే, అలాంటి విజ్ఞప్తులు ఎవరు చేశారన్నదాని గురించి మాత్రం సంస్థ వెల్లడించలేదు.
‘ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం’
ఈ పరిమాణ పెరుగుదల కారణంగా సుగంధద్రవ్యాలను వినియోగించేవారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్‌మెంట్ ప్రోగ్రాం సుస్థిరాహారాభివృద్ధి డైరెక్టర్ అమిత్ ఖురానా హెచ్చరించారు. కాగా, సుగంధ ద్రవ్యాల్లో అధిక పెస్టిసైడ్‌ల వినియోగం కారణంగా కొన్ని ప్రముఖ బ్రాండ్లకు చెందిన అమ్మకాలపై హాంగ్‌కాంగ్, సింగపూర్, మాల్దీవులు గతనెల నిషేధం విధించాయి. అయితే, భారత్‌కు చెందిన ఒక కంపెనీ మాత్రం తమ బ్రాండ్ అమ్మకాలపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది.