– తక్కువ అనుమతులు జారీ చేస్తున్న కెనడా
– భారతీయులకు స్టడీ పర్మిట్ల సంఖ్య
త్వరలో పెరిగే అవకాశం లేదు : కెనడా స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కెనడా, భారత్‌ల మధ్య దౌత్య సంబంధాల వివాదం భారత విద్యార్థుల మీద పడుతున్నది. కెనడా భారతీయ విద్యార్థులకు తక్కువ అధ్యయన అనుమతులను జారీ చేసింది. ఈ అనుమతులు 86 శాతం తగ్గినట్టు సమాచారం. ఈ విషయాన్ని రాయిటర్స్ నివేదించింది. గతేడాది జూన్‌లో వాంకోవర్‌లో జరిగిన సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించిన తర్వాత, భారత్, కెనడా మధ్య ఇప్పటికే దెబ్బతిన్న సంబంధాలు సెప్టెంబర్ నుంచి చాలా ఉద్రిక్తంగా మారాయి. కెనడా ప్రధాని ఆరోపణలను భారత్ ఆ సమయంలోనే కొట్టిపారేసిన విషయం విదితమే. 2023 మూడో త్రైమాసికంలో భారతీయ విద్యార్థులకు జారీ చేసిన 1.08 లక్షల పర్మిట్ల నుంచి, డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో ఈ సంఖ్య 86 శాతం తగ్గి 14,910కి పడిపోయిందని ప్రభుత్వ డేటాను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. కెనడాలో చదువుకోవటానికి తక్కువ మంది భారతీయ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవటం దీనికి కారణం. అలాగే, అలాంటి అనుమతులను ప్రాసెస్ చేయగల కెనడియన్ దౌత్యవేత్తలను కూడా భారత్ తొలగించింది. భారత ప్రభుత్వం తమ దౌత్యపరమైన మినహాయింపులను ఉపసంహరించుకుంటామని బెదిరించటంతో కెనడా గతేడాది అక్టోబర్‌లో భారత్ నుంచి 62 మంది దౌత్యవేత్తలలో 41 మందిని ఉపసంహరించుకున్నది. ”భారతదేశంతో మా సంబంధం నిజంగా భారత్ నుంచి చాలా దరఖాస్తులను ప్రాసెస్ చేయగల మా సామర్థ్యాన్ని సగానికి తగ్గించింది” అని కెనడియన్ ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ రాయిటర్స్‌తో అన్నారు. భారతీయులకు ఇచ్చే స్టడీ పర్మిట్ల సంఖ్య త్వరలో పెరిగే అవకాశం లేదని మిల్లర్ తెలిపారు.