ఈడీకి డైరెక్టర్‌ ఏడీ?

Director of ED?– తాత్కాలిక నియామకంతో నెట్టుకొస్తున్న కేంద్రం
– ఈడీకి అపరిమిత అధికారాలున్నాయంటూ కోర్టు తీర్పు
– పదవీ విరమణ చేస్తూ తీర్పు చెప్పిన న్యాయమూర్తికి లోక్‌పాల్‌ పదవితో సత్కారం
– ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా దర్యాప్తు సంస్థ దూకుడు
– పాలకపార్టీ కీలుబొమ్మగా మారిందని విమర్శలు
న్యూఢిల్లీ : ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ). ఈ దర్యాప్తు సంస్థ మున్నెన్నడూ లేని విధంగా విశేషాధికారాలు చెలాయిస్తోంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలపై దూకుడుగా వ్యవహరిస్తూ దాడులు చేస్తోంది. బీజేపీలో చేరితే సరేసరి. లేకుంటే దాడులు, సోదాలు, శ్రీకృష్ణ జన్మస్థానం…అదే కారాగారవాసం తప్పవు. ఈడీ దాడులు ఎదుర్కొన్న పలు కంపెనీలు కాళ్ల బేరానికి వచ్చి ఎన్నికల బాండ్ల కొనుగోలు ద్వారా అధికార పార్టీకి నజరానాలు సమర్పించుకున్నాయి. ముఖ్యంగా గత రెండు సంవత్సరాల కాలంలో ఈడీ ఎంతో ‘క్రియాశీలకం’గా వ్యవహరిస్తూ పాలక పక్షానికి ఎనలేని మేలు చేకూరుస్తోంది.
కుంటిసాకులతో మిశ్రా పదవీకాలం పొడిగింపు
ఈడీకి చిట్టచివరి డైరెక్టర్‌గా వ్యవహరించిన సంజరు కె. మిశ్రా పదవీకాలం గత సంవత్సరం సెప్టెంబర్‌ 15తో ముగిసింది. అంతకుముందు ఆయన పదవీకాలాన్ని మోడీ ప్రభుత్వం పలుసార్లు పొడిగించింది. అందుకోసం అనేక సాకులు చెప్పింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని కూడా చవిచూసింది. ఆయనను పదవిలో కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మిశ్రాను పదవిలో కొనసాగించడం అవసరమని న్యాయస్థానంలో వాదించింది. ఐరాస ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ సమీక్ష జరుగుతున్నందున ఆయన కొనసాగడం ముఖ్యమని తెలిపింది. అయినా సుప్రీంకోర్టు ససేమిరా అనడంతో మిశ్రా పదవి నుండి వైదొలగక తప్పలేదు. ఆ తర్వాత ఇప్పటి వరకూ అత్యంత ‘శక్తివంతమైన’ దర్యాప్తు సంస్థకు పూర్తి స్థాయి డైరెక్టర్‌ను ప్రభుత్వం నియమించలేదు. తాత్కాలిక డైరెక్టర్‌ రాహుల్‌ నవీన్‌తోనే కాలం గడుపుతోంది. నవీన్‌కు ఈడీ ప్రత్యేక డైరెక్టర్‌గా అదనపు కార్యదర్శి హోదాలో పదోన్నతి కల్పించడాన్ని క్యాబినెట్‌ నియామకాల కమిటీ జనవరిలో ఆమోదించింది.
ఖాళీల భర్తీలో అలసత్వం
రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి పదవీకాలాన్ని పదేపదే పొడిగించడం, వారు వైదొలిగిన తర్వాత తాత్కాలిక నియామకాలతో కాలక్షేపం చేయడం మోడీ ప్రభుత్వ హయాంలో పరిపాటిగా మారింది. మూడు సంవత్సరాల పదవీకాలం కలిగిన లా కమిషన్‌లో రెండున్నర ఏండ్లుగా పదవులు ఖాళీగా ఉన్నాయి. సమాచార కమిషనర్‌ పదవులను కూడా సంవత్సరాల తరబడి భర్తీ చేయడం లేదు.
ఈడి అపరిమిత అధికారాలు
మనీ లాండరింగ్‌ నిరోధక చట్టానికి చేసిన సవరణలకు గత సంవత్సరం సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. సమన్లు జారీ చేయడానికి, స్టేట్‌మెంట్లు నమోదు చేయడానికి, అరెస్టులు చేయడానికి, సోదాలు చేయడానికి, ఆస్తులు జప్తు చేయడానికి ఈడీకి విస్తృత అధికారాలు ఉన్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. రెండు రోజుల్లో పదవీ విరమణ చేయనున్న జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఈ తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడానికి కొద్ది రోజుల ముందు అంటే ఈ నెల 10న ఖన్విల్కర్‌ను ప్రభుత్వం లోక్‌పాల్‌గా నియమించింది. కాగా తనపై వచ్చిన ఆరోపణలను ఈడీ తోసిపుచ్చింది.
ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా…
ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకొని ఈడీ దూకుడుగా వ్యవహరించడాన్ని 2022లో ‘స్క్రోల్‌’ పోర్టల్‌ ఎత్తిచూపింది. ‘ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా ఈడీ వేగవంతంగా దర్యాప్తులు చేపడుతోంది. అయితే బీజేపీ నేతల ప్రమేయం ఉన్న కేసుల్లో మాత్రం అదే వేగం కన్పించడం లేదు’ అని తెలిపింది. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈడీ పెట్టిన కేసుల్లో 95 శాతం ప్రతిపక్ష నేతలపై నమోదు చేసినవే. 2014, 2022 సెప్టెంబర్‌ మధ్యకాలంలో 121 మంది ప్రముఖ నేతలపై ఈడీ నిఘా పెట్టింది. వీరిలో 115 మంది ప్రతిపక్ష నాయకులే. ఆ తర్వాత కూడా ఈ జాబితా చాంతాడంత పెరిగిపోయింది.