దర్శకుడు ప్రసాద్‌ కన్నుమూత

పలు చిత్రాలతో అభిరుచిగల దర్శకుడిగా పేరొందిన ఎన్‌.ఎస్‌.ఆర్‌. ప్రసాద్‌ (49) ఇకలేరు.
గత కొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన శనివారం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని జంగారెడ్డి గూడెంకి చెందిన ప్రసాద్‌ సినిమాలపై మక్కువతో సినీ రంగ ప్రవేశం చేశారు. తొలుత రచయితగా పలు చిత్రాలకు పని చేశారు. ఆ తర్వాత ఆర్యన్‌ రాజేష్‌ హీరోగా మూవీ మొఘల్‌ డా|| డి.రామానాయుడు నిర్మించిన ‘నిరీక్షణ’ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. సీతారామ్‌గా పరిశ్రమ వర్గాలకు బాగా సుపరిచితుడైన ప్రసాద్‌ ఆ తర్వాత శ్రీకాంత్‌తో ‘శత్రువు’, నవదీప్‌తో ‘నటుడు’ చిత్రాలకు దర్శత్వం వహించారు. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెక్కి’ సినిమా విడుదల సన్నాహాల్లో ఉంది. దర్శకుడు ప్రసాద్‌ మృతి పట్ల పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.