దర్శకులే నా గురువులు..

Thanks to the audienceపీరియాడిక్‌ వెబ్‌ సిరీస్‌ ‘వికటకవి’ నవంబర్‌ 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ అవుతూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఈ సందర్భంగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజయ్ అరసాడ మీడియాతో మాట్లాడుతూ, ‘వైజాగ్‌లో పుట్టి, పెరిగాను. గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ చేసి, టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా 2018 వరకు జాబ్‌ చేశాను. ఇదే సమయంలో కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌కు వర్క్‌ చేశాను. ప్రదీప్‌ అద్వైత్‌ ద్వారా ‘జగన్నాటకం’ మూవీలో ఛాన్స్‌ వచ్చింది. తరువాత నా చిన్ననాటి స్నేహితుడు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్రీచరణ్‌ పాకాల నన్ను ‘గూఢచారి’ సినిమాలో కీ బోర్డ్‌ ప్రోగ్రామింగ్‌ కోసం వర్క్‌ చేయమని అడగటంతో వర్క్‌ చేశాను. అలా ‘క్షీర సాగర మథనం, నేడే విడుదల, మిస్సింగ్‌, శ్రీరంగనీతులు’ సినిమాలకు వర్క్‌ చేశాను. సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లైన ‘సేవ్‌ ది టైగర్స్‌ సీజన్‌1, సీజన్‌2’లకు సంగీతాన్ని అందించాను. సంగీత దర్శకుడిగా ‘ఆరు’ మంచి గుర్తింపునిచ్చింది. ‘వికటకవి’ మ్యూజిక్‌కి కూడా మంచి పేరు రావడం ఆనందంగా ఉంది. ఇలాంటి సిరీస్‌లకు సంగీతం అందించడం ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ప్రదీప్‌ మద్దాలి చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. ఈ సిరీస్‌కోసం కొత్తగా ప్రయత్నం చేశాం. డైౖరెక్టర్లే నాకు గురువులు అని భావిస్తాను. ప్రస్తుతం ‘త్రీరోజెస్‌’ సీజన్‌ 2తో పాటు ఆహాలో మరో రెండు వెబ్‌ సిరీస్‌లకు వర్క్‌ చేస్తున్నాను. కొన్ని సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. వీటి వివరాలను త్వరలోనే తెలియజేస్తాను’ అని తెలిపారు.