నిరాశపర్చింది

నిరాశపర్చింది– నిధులు కేటాయించకుండా హామీలు ఎలా అమలు చేస్తారు :మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర బడ్జెట్‌ తీవ్ర నిరాశ పరిచిందని, కొండంత చూపి గోరంత కూడా నిధులు కేటాయించలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. ప్రజాపాలన అభాసుపాలు అయ్యిందన్నారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ప్రజాదర్బార్‌ను ప్రతిరోజూ నిర్వహిస్తామని చెప్పారని, కానీ అలా జరగడం లేదన్నారు. ప్రజాపాలనకు ఒక్కరోజు సీఎం పోయారని, మూడ్రోజులు మంత్రులు వెళ్లారని, ఆ తర్వాత ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు పరిమితమైందన్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, యువతోపాటు రాష్ట్ర ప్రజలందరినీ బడ్జెట్‌ తీవ్ర నిరాశపర్చిందన్నారు. రైతులకు తగిన నిధులు కేటాయించకుండా పంటల బీమా, మద్దతు ధర, రైతు భరోసా, రుణ మాఫీ ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో, అసెంబ్లీలో సైతం అబద్దాలే చెబుతోందన్నారు. వ్యవసాయ రంగానికి కేటాయించిన రూ.19 వేల కోట్ల నిధుల్లో రైతు భరోసా ఎలా అమలు చేస్తారన్నారు. రైతు భరోసాకు రూ.22 వేల కోట్లు అవసరమని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే రూ.82వేల కోట్లు కావాలని, బడ్జెట్‌లో రూ.16వేల కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. పంటల బోనస్‌కు రూ.15వేల కోట్లు, రుణమాఫీకి రూ.40వేల కోట్లు అవసరమన్నారు. 119 నియోజకవర్గాల్లో 3500 ఇండ్లు ఇస్తామని చెప్పారని, ఇండ్ల నిర్మాణానికి రూ.23వేల కోట్లు కావాలని, అయితే ఇందిరమ్మ ఇండ్లకు రూ.7,100కోట్లు కేటాయించారని అన్నారు. 24 గంటల కరెంట్‌ సరఫరాను రాష్ట్రంలో ఎక్కడ ఇస్తున్నారో చూద్దామని, ఎక్కడైనా సరే లాగ్‌బుక్‌లు పరిశీలిద్దాం రావాలని సవాల్‌ విసిరారు. రైతులకు కేసీఆర్‌ అండగా నిలిచారన్నారు. ఆరు గ్యారంటీలపై చట్టం చేస్తామని చెప్పారని, కానీ అసెంబ్లీ రెండు సమావేశాలు అయిపోతున్నా అమలు చేయలేదన్నారు. వంద రోజుల్లో హామీలు అమలు చేయలేమని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడే చేతులు ఎత్తేసిందని విమర్శించారు.