– సెమీస్‌లో పోరాడి ఓడిన డబుల్స్ జోడీ
– మకావు ఓపెన్ సూపర్ 300
మకావు (చైనా) : మకావు ఓపెన్ సూపర్ 300 టోర్నమెంట్‌లో భారత వర్థమాన డబుల్స్ జోడీ ట్రెసా జాలి, పుల్లెల గాయత్రిలకు అనూహ్య పరాజయం ఎదురైంది. మహిళల డబుల్స్‌లో మూడో సీడ్ ట్రెసా, గాయత్రిలు శనివారం జరిగిన సెమీఫైనల్లో మూడు గేముల పోరాటంలో తలొంచారు. ఎనిమిదో సీడ్ చైనీస్ తైపీ జోడీ షాన్, హంగ్‌లు 21-17, 16-21, 21-10తో ట్రెసా, గాయత్రిలపై గెలుపొందారు. 60 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో గాయత్రి, ట్రెసాలు అంచనాలను అందుకోలేదు. తొలి గేమ్‌ను17-21తో కోల్పోయిన మనోళ్లు రెండో గేమ్‌లో పుంజుకున్నారు. 21-16తో రెండో గేమ్‌లో నెగ్గి లెక్క సమం చేశారు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ట్రెసా, గాయత్రి నిరాశపరిచారు. ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. 21-10తో మూడో గేమ్‌తో పాటు ఫైనల్స్ బెర్త్‌ను చైనీస్ తైపీ జంట సొంతం చేసుకుంది. గాయత్రి, ట్రెసా ఓటమితో మకావు ఓపెన్‌లో భారత టైటిల్ వేటకు తెరపడింది.