– కామారెడ్డి మున్సిపల్ ఇన్‌చార్జి చైర్మెన్‌గా గడ్డం ఇందుప్రియ
నవతెలంగాణ-కామారెడ్డి/ రామడుగు
కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై, కరీంనగర్ జిల్లా రామడుగు మండల ఎంపీపీపై సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు నెగ్గాయి. శనివారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, మున్సిపల్ కమిషనర్ సుజాత ఆధ్వర్యంలో చైర్‌పర్సన్ నిట్టు జాహ్నవిపై అవిశ్వాస తీర్మానం సమావేశం నిర్వహించారు. 49 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో అవిశ్వాసం నెగ్గడానికి 34 మంది సభ్యులు అవసరం ఉండగా.. 37 మంది సభ్యులు హాజరై తమ మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 27 మంది కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా మద్దతు తెలిపారు. 37 మంది సభ్యులు మున్సిపల్ చైర్‌పర్సన్ జాహ్నవికి వ్యతిరేకంగా చేతులెత్తి మద్దతు తెలిపారు. దీంతో అధికారులు అవిశ్వాసం నెగ్గినట్లు ప్రకటించారు. ఇన్‌చార్జి చైర్మెన్‌గా ప్రస్తుతం వైస్ చైర్మెన్‌గా ఉన్న గడ్డం ఇందుప్రియ బాధ్యతలు స్వీకరించారు.
రామడుగు ఎంపీపీపై..
కరీంనగర్ జిల్లా రామడుగు మండల ఎంపీపీపై సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మండల పరిషత్‌లో 14మంది సభ్యులు ఉన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీ ఎంపీటీసీలు 12మంది.. ఈ యేడాది జనవరి నెలలో టీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీపీ కలిగేటి కవితాలక్ష్మణ్‌పై అవిశ్వాసం ప్రకటిస్తూ ఆర్‌డీఓకు తీర్మాన పత్రం అందజేశారు. ఈ క్రమంలో అవిశ్వాసంపై ఎంపీపీ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. స్టే కాలం ముగియడంతో మండల కేంద్రంలో ఆర్‌డీఓ మహేశ్వర్ శనివారం ఎంపీడీఓ రాజేశ్వరి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అవిశ్వాస తీర్మానానికి 12 మంది సభ్యులు చేతులెత్తి మద్దతు పలికారు. దీంతో ఎంపీపీ కలిగేటి కవితపై అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు ఇన్‌చార్జి ఎంపీపీగా వైస్ ఎంపీపీ పూరెల్ల గోపాల్‌గౌడ్ కొనసాగుతారని ఆర్‌డీఓ తెలిపారు. సభ్యులంతా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన వన్నారం ఎంపీటీసీ జవ్వాజి హరీష్ వైపు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.