– సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో
– ఎన్నికల బాండ్ల గుట్టు బహిర్గతం
న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు ఇచ్చిన తదుపరి ఆదేశాన్ని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో స్వాగతించింది. బాండ్లు ఇచ్చిన దాతలు, పుచ్చుకున్నవారి పేర్లు తెలిసేలా ఎన్నికల బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ కోడ్‌లను ఎస్‌బీఐ అందజేయాలంటూ సుప్రీం కోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలకు అందిన నిధుల వివరాలను ప్రజలకు మరింత పారదర్శకంగా తెలియజేయడానికి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును దెబ్బతీసేందుకే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయన్న వాస్తవం దీంతో మరింత స్పష్టమైందని పొలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది. తమ వద్ద అందుబాటులో వున్న డేటాను ఎన్నికల కమిషన్ తన వెబ్‌సైట్‌లో గురువారం అప్‌లోడ్ చేసినప్పటి నుంచి, ఈ డేటాను విశ్లేషించే యత్నాలు మొదలయ్యాయి. ఈ ఎన్నికల బాండ్ల పూర్తి ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టొచ్చని పొలిట్‌బ్యూరో పేర్కొంది. అయితే, ఎన్నికల బాండ్ల ద్వారా కార్పొరేట్ సంస్థల నుంచి నిధులను బలవంతంగా వసూలు చేసేందుకు ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించారని, అలాగే క్విడ్ ప్రొ కో వంటివి కూడా చోటుచేసు కున్నాయని ప్రాధమిక విశ్లేషణల్లో వెల్లడవుతోందని పొలిట్‌బ్యూరో తెలిపింది. ప్రజాస్వామ్యం భవితవ్యం పట్ల ఆసక్తి కలిగిన అన్ని రాజకీయ పార్టీలు, గ్రూపులు, వ్యక్తులు అందరూ కూడా ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న ఇటువంటి దారుణమైన ప్రయత్నాలను నిరసిస్తూ, వీటిని ప్రతిఘటించాలని సీపీఐ(ఎం) కోరింది.