– ఎయిర్‌పోర్టు వరకూ మెట్రో…
– సంస్కరణలతో అత్యుత్తమ పాలన
– అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం
– సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్‌గా మారుస్తాం
– రేపు పీసీసీ విస్తృతస్థాయి సమావేశం
– పార్టీ కోసం పని చేసిన వారికే పదవులు
– ఈ ప్రక్రియలో పైరవీలకు తావుండదు : మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రంగారెడ్డి జిల్లాలోని ఫార్మా సిటీని రద్దు చేయబోమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో ఎంత మాత్రమూ నిజం లేదన్నారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి గతంలో కంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో సీఎం ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మియాపూర్ నుంచి మైండ్ స్పేస్ వరకూ ఉన్న మెట్రోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామని చెప్పారు. తాము కొత్తగా ప్రతిపాదించబోతున్న మెట్రో కారిడార్లు గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఖర్చుతో పోలిస్తే తక్కువ వ్యయంతోనే పూర్తవుతాయని ఆయన వివరించారు. గత ప్రభుత్వం ఎయిర్‌పోర్టుకు ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే ఇప్పుడు దూరాన్ని మరింతగా తగ్గిస్తామని చెప్పారు. బీహెచ్ఈఎల్ నుంచి ఎయిర్‌పోర్టు వరకూ 32 కిలోమీటర్ల దూరముంటుందని తెలిపారు. మరోవైపు ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకూ మెట్రో ఉంటుందని స్పష్టం చేశారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓవైసీ ఆస్పత్రి మీదుగా వెళ్లే మెట్రోను చాంద్రాయణగుట్ట వద్ద ఎయిర్‌పోర్టుకి వెళ్లే లైన్‌కి లింక్ చేస్తామని వివరించారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం వరకూ మెట్రోను పొడిగిస్తామని చెప్పారు.
ఫార్మాసిటీని పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నామనీ, రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య జీరో కాలుష్యంతో ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని రేవంత్ ఈ సందర్భంగా వెల్లడించారు. వాటి వద్ద పరిశ్రమల్లో పనిచేసే వారికి ఇండ్లను నిర్మిస్తామని చెప్పారు. యువతకు అవసరమైన నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన సంస్థలు, ప్రముఖ పారిశ్రామికవేత్తల ద్వారా వారికి శిక్షణనిప్పిస్తామని వివరించారు. వంద పడకల ఆస్పత్రులున్న చోట నర్సింగ్ కళాశాలలను కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామని వెల్లడించారు. అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి…సంస్కరణలతో అత్యుత్తమ పాలనను అందిస్తామంటూ భరోసానిచ్చారు. ప్రభుత్వ శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమించడం వరకు సీఎంగా తన బాధ్యతనీ, ఆ తర్వాత ఆయా అధిపతులు తమ పరిధిలో అవసరమైన అధికారులను నియమించుకోవటం ద్వారా యంత్రాంగం సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలని అన్నారు. తాను చెప్పిందే చేస్తానంటూ సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జర్నలిస్టుల సమస్యలను వంద రోజుల్లో పరిష్కరిస్తామని హామీనిచ్చారు. అయితే ముందుగా ప్రెస్ అకాడమీకి చైర్మెన్‌ను నియమించాల్సి ఉందన్నారు. త్వరలోనే ఆ పోస్టును భర్తీ చేస్తామని చెప్పారు.
బుధవారం పీసీసీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించబోతున్నామని రేవంత్ ఈ సందర్భంగా తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఉంటాయని ఆయన హామీనిచ్చారు. ఆ అంశంలో పైరవీలకు ఏమాత్రం తావుండబోదనీ, బంధువులనో, మరొకరనో పదవులు ఇవ్వబోమని స్పష్టంచేశారు. డ్రగ్స్ మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని చెప్పారు. నక్సల్స్ ఏరివేతకు గతంలో అంతరాష్ట్ర సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహించేవారని గుర్తు చేశారు. అదే తరహాలో ఇప్పుడు డ్రగ్స్ సరఫరాను అడ్డుకుంటామని రేవంత్ తెలిపారు.
గతంలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్‌గా మారుస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. అక్కడున్న భవనాల్లో ఒకదాన్ని ఇప్పటికే డిప్యూటీ సీఎంకు కేటాయించామని గుర్తు చేశారు. మరో భవనాన్ని మంత్రి సీతక్కకు కేటాయిస్తామని వెల్లడించారు. మిగిలిన బిల్డింగుల్లో మహాత్మా జ్యోతిరావు ఫూలే రీసెర్చి సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దానికి చైర్మెన్‌గా తానే (సీఎం) ఉంటానని చెప్పారు. అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులుగా ప్రొఫెసర్ నాగేశ్వర్, హరగోపాల్, విశ్రాంత ఐఏఎస్ ఆకునూరి మురళితోపాటు ఇతర మేధావులు, నిపుణులను నియమిస్తామని వివరించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే విధి విధానాలను ఖరారు చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన ప్రముఖ పారిశ్రామికవేత్తల ద్వారా యువతకు ఈ సెంటర్లో శిక్షణనిప్పిస్తామని చెప్పారు. సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలతోపాటు ఇక్కడ అదనంగా నైపుణ్యాలకు పదును పెడతామని వివరించారు. అక్కడి నుంచి బయటకు వెళ్లే వారికి క్యాంపస్‌లోనే ఎంపిక ఉంటుందని తెలిపారు. ఆ రకంగా తఇతర దేశాలకు అవసరమైన మానవ వనరులను ప్రభుత్వం ద్వారా అందిస్తామని చెప్పారు. తద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.