నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు నుంచి ఆంగ్లానికి అనువాదం చేసే అనువాదకుల సంఖ్యను విస్తృతంగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. హైస్కూలు స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు వేల సంఖ్యలో ఆంగ్లంపై పట్టు సాధించిన అధ్యాపకులున్నారని వీరందరినీ అనువాదకులుగా తీర్చిదిద్దుకోవాల్సిన పనిని పేరుగడించిన అనువాదకులు తమ భుజస్కంధాలపై వేసుకోవాలని పేర్కొన్నారు.
ప్రఖ్యాత విమర్శకులు, కవి, ఎలనాగ రచించిన 4 పుస్తకాలను ఆదివారం రవీంద్రభారతి కాన్ఫరెన్సు హాలులో ఆవిష్కరించటం జరిగింది. ఎలనాగ రచనలు ’’ఉర్రూత‘‘ కవితా సంపుటిని అమ్మంగి వేణుగోపాల్, ’’శవాలను మోసేవాడికథ‘‘ అనువాద నవలను డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ’’జాజ్జాలర్స్‘‘ ఆంగ్ల మిని కవితా సంపుటిని ప్రొఫెసర్ సి.లక్ష్మీ నారాయణ ’’ఆత్మగానం‘‘ కవితాసంపుటిని ప్రొఫెసర్ జి. చెన్నకేశవరెడ్డి ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణల సభకు ముఖ్య అతిథిగా హాజరైన జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ మనకున్న ఆంగ్ల బోధకుల ప్రతిభ అసమాన్యమైనదని వారిలో నుంచి వందల సంఖ్యలో సృజనాత్మక అనువాద రచయితలుగా మలచుకుని తీర్చిదిద్దుకోవచ్చన్నారు. ’’ఎలనాగ‘‘ వంటి కవి, అనువాద రచయితలుండడం తెలంగాణ గర్వించదగిందని చెప్పారు. ’’ఎలనాగ‘‘ సృజనాత్మకత ఉట్టి పడే విధంగా కవిత్వం రాయగలరని శక్తివంతంగా అనువాద రచనలు చేయగలరని వివరించారు. ఇప్పటి వరకు ఎలనాగ 37 గ్రంథాలను వెలువరించారని తెలిపారు. తెలుగు నుంచి ఆంగ్లానికి అనువాదాలు చేసే పనిలో సాహిత్య అకాడమీ తన వంతు పాత్ర పోషిస్తుందని జూలూరు తెలిపారు. ఈ సభకు అమ్మంగి వేణుగోపాల్ అధ్యక్షత వహించగా గౌరవ అతిథిగా విచ్చేసిన ఓడిశా ఐ.ఏ.ఎస్ అధికారి, ప్రముఖ ఒడియా కవి ప్రదీప్ బిస్వాల్, ప్రముఖ కవులు డా. ఏనుగు నర్సింహారెడ్డి, ప్రొ.పి.లక్ష్మీనారాయణ, ప్రొ.జి.చెన్నకేశవరెడ్డి, అనువాదకుడు, రచయిత, కవి ’ఎలనాగ‘ తదితరులు మాట్లాడారు.