రాష్ట్రంలోని పాఠశాల విద్యావ్యవస్థలో అధిక సంఖ్యలో ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్స్‌పై అంతులేని వివక్ష కొనసాగుతున్నది. పాఠశాల విద్యా వ్యవస్థకు పునాది అయినా ప్రాథమిక పాఠశాలలను సంరక్షిస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయులకు అటు పదోన్నతుల్లో ఇటు వేతన స్థిరీ కరణలో తీవ్రఅన్యాయం జరుగుతున్నది. ఉపాధ్యాయ సంఘాలకు సభ్యత్వాలు ఇవ్వడంలో వివిధ ఉపాధ్యాయ సమస్యలపై పోరాటాలకు ముందు వరుసలో ఉండే వీరికి అటు ప్రభుత్వం ఇటు సంఘాలు పట్టించుకోకపోవడం వల్ల వారి సమస్యలు తీరక తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యా యులు ఉండాలి అనే అశాస్త్రీయమైన నిబంధన వల్ల ప్రాథమిక పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. రాష్ట్రంలోని సింహభాగం ప్రాథమిక పాఠశాలలో సగటున ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. విద్యార్థుల సంఖ్య తగ్గిందని ఉన్న రెండు పోస్టుల్లో ఒకటి తీసేస్తారు లేదా డిప్యూటేషన్ పంపిస్తారు. గ్రామంలోని తల్లిదండ్రులు ఒక్కరితో బడి ఎలా నడుస్తుందని వారి పిల్లలను ప్రయివేట్ బడులకు పంపిస్తున్నారు. చివరకు పిల్లల సంఖ్య జీరో అయిందని ఆ బడి మూసి వేసే పరిస్థితి వస్తున్నది. రాష్ట్రంలో గత మూడేళ్లలో దాదాపుగా 1500 ప్రాథమిక పాఠశాలలను జీరో విద్యార్థుల నమోదు కారణం చేత మూసివేశారు. 317 జీవో వలన మరియు ఇటీవల జరిగిన బదిలీల వల్ల రాష్ట్రంలో 20శాతం పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మిగిలిపోయాయి. విద్యాహక్కు చట్టం నిబంధనలు సవరించి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని ఇచ్చి పని భారం తగ్గించాలని ఎస్ జి టి ఉపాధ్యాయులు వేడుకుంటున్నారు.
పదోన్నతుల్లోను అన్యాయమే
పాఠశాల విద్యా వ్యవస్థలో 65 వేల పైగా ఉన్న ఎస్జీటీలకు ఇటీవల జరిగిన పదోన్నతులలో తీవ్ర అన్యాయం జరిగినది. ఉద్యోగులకు సంబంధించి వివిధ క్యాడర్లలో రెండేళ్లకే పదోన్నతి వస్తే ఎస్జీటీ ఉపాధ్యాయులకు మాత్రం 20-25 ఏండ్లు గడిచిన పదోన్నతి అందని ద్రాక్షగా మారినది. ఉమ్మడి రాష్ట్రంలో గతంలో అదనపు విద్య అర్హతలకు అదనపు ఇంక్రిమెంట్లు ఇచ్చేవారు కానీ ఆ తర్వాత దాన్ని రద్దు చేయడం వల్ల ఉద్యోగ కాలంలో వచ్చే నాలుగు ఇంక్రిమెంట్లను ఎస్జీటీలు కోల్పోయినారు. అలాగే ప్రాథమిక పాఠశాలలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న ఎస్జీటీలకు నెలకు రూ.125 అదనపు అలవెన్స్ ఇస్తున్నారు. ఇంత తక్కువ భత్యం ఇచ్చుట అత్యంత దారుణంగా అవమానించడమే అని ఎస్ జి టి లు వాపోతున్నారు. అలాగే ఇటీవల జరిగిన పండిత పీఈటీ అప్‌గ్రెడేషన్‌లో అన్ని అర్హతలు ఉన్న ఎస్జీటీలకు పదోన్నతులు దక్కకపోవడం వలన ఎస్జీటీలు తీవ్ర నిరాశలో ఉన్నారు.
ప్రతి పీఆర్సీలోనూ అంతే
రాష్ట్రంలో సింహభాగం ఉన్న ఎస్జీటీ ఉపాధ్యాయులకు ప్రతి వేతన సవరణలో తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఒకే విద్య అర్హతలు కలిగి పాఠశాల విద్యలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ఎస్జీటీలకు వేతన వ్యత్యాసం అంతకంతకు పెరుగుతున్నది. 2010పీఆర్సీలో ఎస్జిటీలకు పే రూ.10900 ఉండగా స్కూల్ అసిస్టెంట్లకు రూ.14860 గా ఉంది. కానీ 2015 పీఆర్సీలో ఎస్జీటీలకు జీతం రూ.21230 ఉండగా స్కూల్ అసిస్టెంట్లకు రూ.28940 కి పెరిగినది. 2020 పీఆర్సీలో ఎస్జీటీల జీతం రరూ.31040 కి పెరగగా స్కూల్ అసిస్టెంట్ల జీతం రూ.42300 అయినది. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఇవ్వనున్న రెండో వేతన సవరణలో భాగంగా ఉపాధ్యాయ సంఘాలు ఎస్‌ఏ ల జీతం 77 వేలకు పైగా ప్రతిపాదించగా ఎస్జీటీల వేతనాన్ని కేవలం 62000 మాత్రమే ప్రతిపాదించాయి. ఇటు సంఘాలు అటు ప్రభుత్వం వేతన స్థిరకరణలో ఎస్జీటీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి.
ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు లేకపోవడం వల్ల ఎస్జీటీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. మొదటగా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న అందరు ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి. అలాగే ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్‌ల వేతన వ్యత్యాసం తగ్గించి పీఆర్సీలో బేసిక్ జీతం పెంచాలి. పన్నెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రతి ఎస్జీటీ ఉపాధ్యాయుడికి స్కూల్ అసిస్టెంట్ హోదా ఇవ్వాలి.
అలాగే 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎస్జీటీకి జిహెచ్‌ఎం హోదా ఇవ్వాలి. విద్యాహక్కు చట్టం నిబంధనను సవరించి ప్రతి ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుని కేటాయించి ఎస్జీటీల పని భారాన్ని తగ్గించాలి. అలాగే ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుని నియమించాలి. ఎస్జీటీ ఉపాధ్యాయుడికి తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్న ఎఫ్‌ఎల్‌ఎన్, సిసిఈ కార్యక్రమాలను రద్దు చేయాలి. పాఠశాల విద్యలో పునాది అయిన ప్రాథమిక విద్యను సంరక్షిస్తే నేటి బాలలు రేపటి భావి భారత పౌరులుగా ఎదుగుతారు.
– అంకం నరేష్, 6301650324