గర్శకుర్తి మండల కేంద్రం ఏర్పాటుపై సర్కారు వివక్ష

– బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శ
నవతెలంగాణ – గంగాధర : గర్శకుర్తిని మండల కేంద్రంగా ప్రకటించకుండా ప్రభుత్వం వివక్ష చూపుతుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. బహుజన సమాజ్ పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జ్ కొంకటి శేఖర్ తో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్థానిక బీఎస్పీ నాయకులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే రవిశంకర్ తో సహా పలువురు నాయకులు మండల కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించి నిర్లక్ష్యం ప్రదర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గర్శకుర్తిని తక్షణమే మండల కేంద్రంగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల సౌలబ్యం దృష్ట్యా అనేక మండలాలు, గ్రామాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం మెజార్టీ గ్రామాలతో కూడుకున్న గర్షకుర్తిని మండల కేంద్రంగా ప్రకటించడంలో ఎందుకు జాప్యం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ ఆ గ్రామ ప్రజలు 53 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టిన ప్రభుత్వం, పాలకులు స్పందించకుండా నిర్లక్ష్య దోరణితో వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్న గ్రామాన్ని మండల కేంద్రంగా మార్చడానికి లేని అడ్డంకులు గర్శకుర్తిని ప్రకటించడానికి ఎం అభ్యంతరమని ప్రశ్నించారు. గర్శకుర్తిని మండల కేంద్రంగా ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేలా చేస్తామని ఆయన హెచ్చరించారు. గర్శకుర్తిలో గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు తమ బీఎస్పీ పార్టీ పరంగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. ఘర్షకుర్తి మండల సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంపూర్ణ మద్దతు ప్రకటించడం పట్ల బీఎస్పీ నాయకులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.