ఉపాధిలో వివక్ష

– నిధుల కేటాయింపు అంతా ఒకేలా వద్దు- కేంద్ర గ్రామీణాభివద్ధి మంత్రిత్వ శాఖ ప్యానెల్‌ సిఫార్సు
– ఇప్పటికే నిధుల్లో భారీ కోత విధించిన మోడీ సర్కారు
కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకం నిధుల కేటాయింపులో కోత విధించిన మోడీ సర్కారు ఇప్పుడు దాన్ని మరింత కుదించే చర్యలకు పాల్పడుతున్నది. ఇస్తున్న అరకొర నిధుల్ని కూడా అన్ని రాష్ట్రాలకు ఒకేలా కాకుండా ‘పేదరికం’ ప్రాతిపదికన ఇవ్వాలంటూ కేంద్ర గ్రామీణాభివద్ధి మంత్రిత్వ శాఖ ప్యానెల్‌ సిఫార్సు చేసింది. దీనివల్ల అనేక రాష్ట్రాల్లో ‘ఉపాధి’ నిధులకు కోత పడే ప్రమాదం ఉంది. దానికి తోడు ఏఏ రాష్ట్రాల్లో ఏఏ ఉపాధి అభివృద్ధి పనులు చేపట్టారో లెక్కలు తీసి, దాని ప్రకారమే నిధులు కేటాయించాలని కూడా ప్యానెల్‌ సిఫార్సు చేసింది. దీనితో ఇప్పటి వరకు ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కాస్తో కూస్తో అభివృద్ధిని సాధించిన రాష్ట్రాలకూ నిధుల కేటాయింపులో కోత పడే అవకాశం ఉంది.
2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పథకానికి బడ్జెట్‌ కేటాయింపులు క్రమంగా తగ్గుతున్నాయి. 2023-24 కేంద్ర బడ్జెట్‌లో ‘ఉపాధి’ కేటాయింపులు 32 శాతం తగ్గాయి. కోవిడ్‌ మహమ్మారి సమయంలో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి డిమాండ్‌ బాగా పెరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచే బడ్జెట్‌లో నిధుల కోతను పెంచుతూ వస్తుండటం గమనార్హం.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఉపాధి హామీ పథకం సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2022 అక్టోబర్‌లో తొమ్మిది మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అమర్జీత్‌ సిన్హా నేతృత్వంలోని కమిటీ ఇటీవలే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దానిలో ‘ఉపాధి’ నిధుల్ని మరింత కుదిస్తూ, కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా సిఫార్సులు చేసినట్టు తెలుస్తున్నది. దేశంలోని 49శాతం పేదలున్న ప్రాంతాల్లో 70శాతం ఉపాధి నిధులు ఖర్చు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసిందే తప్ప, నిధుల కేటాయింపు పెంచాలని మాత్రం పేర్కొనలేదు. ఇప్పటి వరకు ‘ఉపాధి’ కింద సృష్టించబడిన ఆస్తులను నిధుల కేటాయింపునకు అనుసంధానం చేస్తూ, దీన్ని పూర్తిగా సవరించాలని సిఫార్సు చేసింది. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పనులు విస్తరించి ఉన్న మొత్తం 7,245 బ్లాకుల్లో 3,500 బ్లాకులు (49 శాతం) అత్యంత పేదరికంలో ఉన్నాయనీ, అక్కడే 70 శాతం ఉపాధి నిధులను ఖర్చు చేయాలని సూచించింది. ఈ 3,500 బాకుల్లో 2,500 నీటి కొరత ఉన్న బ్లాక్‌లు, 1,000 పేదరికంతో ఉన్న బ్లాక్‌లుగా గుర్తించామని కమిటీ తెలిపింది. ఈ ప్రాంతాల్లో బడ్జెట్‌ వ్యయంలో 70 శాతం ఖర్చు చేయాలని సిఫార్సు చేసింది. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చి 9 ఏండ్లు దాటినా దేశంలో ఇప్పటికీ 2,500 బ్లాకుల్లో తీవ్రమైన నీటి కొరత ఉన్నట్టు ఈ నివేదిక స్పష్టం చేయడం గమనార్హం. ఇప్పుడు ‘ఉపాధి’ నిధుల్ని ఇక్కడ ఖర్చు చేయాలని కమిటీ సిఫార్సు చేయడం వివాదాస్పదంగా మారింది. నీటి కొరతకు ‘ఉపాధి’ నిధుల్నే ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కేంద్రప్రభుత్వం అనేక పథకాల ద్వారా గ్రామీణ నీటి వసతిని కల్పిస్తున్నట్టు ప్రచారం చేస్తున్నది. ఇప్పుడు ఈ స్కీంలకు ఈ నిధుల్ని మళ్ళించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. వామపక్షాల ఒత్తిడితో 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. డిమాండ్‌-ఆధారిత పథకం ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 100 రోజుల నైపుణ్యం లేని పనికి హామీ ఇస్తుంది. 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పథకానికి బడ్జెట్‌ కేటాయింపులు క్రమంగా తగ్గుతున్నాయి. 2023-24 కేంద్ర బడ్జెట్‌లో ‘ఉపాధి’ కేటాయింపులు 32 శాతం తగ్గాయి. కోవిడ్‌ మహమ్మారి సమయంలో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి డిమాండ్‌ బాగా పెరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచే బడ్జెట్‌లో నిధుల కోతను పెంచుతూ వస్తుండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, అస్సాం, మేఘాలయ, గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లోని 10 రాష్ట్రాల్లో కేంద్ర గ్రామీణాభివద్ధి మంత్రిత్వ శాఖ ప్యానెల్‌ సర్వే నిర్వహించినట్టు పేర్కొని, ‘అందరికీ ఒకే పరిమాణం’ నిధుల కేటాయింపు పని చేయదని తేల్చింది. సర్వే సందర్భంగా కొత్త సాంకేతికత జోడింపులకు వ్యతిరేకంగా కమిటీకి అనేక ఫిర్యాదులు అందాయని తెలిపింది. దానిలో హాజరు నమోదు చేయడానికి మొబైల్‌ యాప్‌, తప్పనిసరి ఆధార్‌ ఆధారిత చెల్లింపులు ఉన్నాయని వివరించింది. ఉపాధి కార్మికులు, కార్యకర్తలతో సహా ఉపాధి హామీతో అనుబంధించబడిన వారు తప్పనిసరి చేసిన మొబైల్‌ యాప్‌ నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎన్‌ఎంఎంఎస్‌)ని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ యాప్‌లో ప్రతి కార్మికుడి హాజరును గుర్తించడానికి వర్క్‌సైట్‌లో రెండు టైమ్‌ స్టాంప్డ్‌, జియో-ట్యాగ్‌ చేయబడిన ఫోటోగ్రాఫ్‌లు తీసుకోవా లని నిబంధన విధించారు. అనేక సాంకేతిక లోపాలతో ఉన్న ఈ యాప్‌ను కార్మికులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీన్నే ప్రమాణికంగా చేసుకొని కేంద్ర ప్యానెల్‌ కమిటీ కొత్త సిఫార్సులు చేసింది.