పాఠశాల విద్యావ్యవస్థలో తొలగిన వివక్ష : టియస్‌ యుటిఎఫ్‌

నవతెలంగాణ – బోనకల్‌
ప్రభుత్వ పాఠశాల విద్యావ్యవస్థలో అతిపెద్ద వివక్ష తొలగిపోయిందని టీఎస్‌ యుటిఎఫ్‌ మండల కమిటీ హర్షం వ్యక్తం చేసింది. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చసిన విలేకరుల సమావేశంలో టీఎస్‌ యుటిఎఫ్‌ జిల్లా కోశాధికారి వల్లంకొండ రాంబాబు, మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ మాట్లాడుతూ ఉన్నత పాఠశాలల్లో అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులు స్కూల్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌గా ఉండగా, భాషోపాద్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులను సెకండరీ గ్రేడ్‌ పోస్టులుగా ఉంచి వివక్షత చూపించారన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనే సుప్రీంకోర్టు తీర్పునకు అది విరుద్ధంగా ఉందన్నారు. ఈ పరిస్థితిని తొలగించాలని టియస్‌ యుటిఎఫ్‌ చాలాకాలంగా కోరుతుందని, రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల్లోని భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను అప్గ్రేడ్‌ చేసి, ప్రమోషన్స్‌ ద్వారా భర్తీ చేయడంతో పాఠశాల విద్యా వ్యవస్థలో కొనసాగుతున్న అతిపెద్ద వివక్ష తొలగిపోయినట్లు అయిందన్నారు. అందుకు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ హర్షం వ్యక్తం చేస్తుందన్నారు. ఇంకా మిగిలిపోయిన పండిట్‌, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను కూడా అప్‌ గ్రేడ్‌ చేయాలని, ఇకపై స్కూల్‌ అసిస్టెంట్‌ భాషలు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు మొత్తం అర్హతలుగల ఎస్జీటీల ద్వారానే భర్తీ చేసే విధంగా సర్వీసు రూల్స్‌ సవరించాలని కోరారు. విలేకరుల సమావేశంలో టీఎస్‌ యుటిఎఫ్‌ మండల అధ్యక్షులు భూపతి పీత్రం, జిల్లా నాయకులు సద్దా బాబు, మండల కమిటీ సభ్యులు ఆలస్యం పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.