ద్వైపాక్షిక, రక్షణ సహకారంపై చర్చ

– ఐఎన్‌ఎస్‌ త్రిశూల్‌లో జాంజిబార్‌ అధ్యక్షుడితో జై శంకర్‌
జాంజిబార్‌ సిటీ : ప్రస్తుతం టాంజానియాలో పర్యటిస్తున్న భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ ఐఎన్‌ఎస్‌ త్రిశూల్‌లో జాంజిబార్‌ అధ్యక్షుడు డాక్టర్‌ హుస్సేన్‌ అలీ మివిన్వితో కలిసి విందులో పాల్గొన్నారు. తూర్పు ఆఫ్రికా తీరంలో టాంజానియా ద్వీప సమూహమే జాంజిబార్‌, ఈ ప్రాంతంలో శాంతి, సంపదలు విలసిల్లేలా చూడాలన్న భారత్‌ నిబద్ధతకు ఈనాడు ఈ నౌక ఇక్కడుండడం ఒక తార్కాణమని ఆయన వ్యాఖ్యానించారు. భారత నావికాదళానికి చెందిన త్రిశూల్‌ నౌక టాంజానియాలో పర్యటిస్తోంది. జాంజిబార్‌లో రెండు రోజుల అధికార పర్యటన నిమిత్తం బుధవారం జై శంకర్‌ ఇక్కడకు వచ్చారు. అధ్యక్షుడు మివిన్వితో ఆయన ద్వైపాక్షిక సంబంధాలపై, రక్షణ సహకారంపై చర్చలు జరిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి సుస్థిరతలు, సంపద, సంక్షేమాలకు హామీ కల్పించే సముద్ర జలాల చొరవే సాగర్‌ (ఈ ప్రాంతంలో అందరికీ భద్రత, అభివృద్ధి). సాగర్‌ పట్ల నిబద్ధత ఈనాటి తమ పర్యటన, విందు సమావేశంలో ప్రతిఫలిస్తున్నాయని జై శంకర్‌ ట్వీట్‌ చేశారు. ఈ రిసెప్షన్‌లో జై శంకర్‌ మాట్లాడుతూ, భారత పశ్చిమ తీరం, ఆఫ్రికా తూర్పు తీరం మధ్య గల సంబంధాలు చాలా చారిత్రకమైనవని భావిస్తున్నట్లు చెప్పారు. మన అభివృద్ధి భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే సమయం కూడా ఇదేనని ఆయన వ్యాఖ్యానించారు. జలవనరుల అభివృద్ధి రంగంలో భారత్‌కు గల అవకాశాలను జాంజిబార్‌తో పంచుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. జి 20లో ఆఫ్రికన్‌ యూనియన్‌ శాశ్వత సభ్యత్వం గురించి ప్రతిపాదించబడిందని, దీన్ని సభ్య దేశాలు పరిశీలించాలన్నారు.