ప్రజాసమస్యలపై చర్చకే తొలి ప్రాధాన్యం

Gaddam Prasad kumar– సభా సంప్రదాయాలను కొనసాగిస్తా
– ప్రశ్నోత్తరాలూ చేపడతాం
– బీఏసీ నిర్ణయాలను అమలు చేస్తాం
– జీరో అవర్‌ ప్రశ్నలకు జవాబులు పంపిస్తాం
– భద్రతా వ్యవస్ధను పటిష్టం చేస్తాం
– మహిళా ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తాం
– మీడియాను గౌరవిస్తాం నవతెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌
గడ్డం ప్రసాద్‌కుమార్‌
శాసనసభలో ప్రజాసమస్యలకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చి చర్చిస్తాం.. సభా గౌరవాన్ని కాపాడు కుంటాం..సంప్రదాయాలను కొనసాగిస్తాం.. ఎమ్మెల్యేలు జీవరో అవర్‌లో అడిగే ప్రశ్నలకు జవాబులను పంపించే ప్రయత్నం చేస్తాం..గత కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాం మాదిరిగానే మీడియాను గౌరవిస్తాం..శాసనసభ భద్రతను సమీక్షించి పటిష్టం చేస్తాం..సమస్యలు తలెత్తకుండా చూస్తాం..నిబంధనలకు అనుగుణంగా పార్టీలకు సభాసమయం కేటాయిస్తామని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. సభను ప్రజాసమస్యలపై చర్చకు వేదికగా మారుస్తామని చెప్పారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం అసెంబ్లీని నిర్వహిస్తామని వివరించారు. గురువారం అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో నవతెలంగాణ స్పెషల్‌ కరస్పాండెంట్‌ బి.బసవపున్నయ్యకు స్పీకర్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
స్పీకర్‌గా ఎన్నికైన మీకు శుభాకాంక్షలు, ఇంత పెద్ద బాధ్యతను ఎలా భావిస్తున్నారు.

దన్యవాదాలు. గొప్ప అనుభూతి కలుగుతోంది. సంతోషంగా ఉంది. కాంగ్రెస్‌ పార్టీ పెద్దబాధ్యత నామీద పెట్టినట్టయింది. తెలంగాణ అసెంబ్లీకి తొలి దళిత స్పీకర్‌ను నేనే. ఉన్నతస్థాయి బాధ్యతలు అప్పగించినందుకు ధన్యుడిని. నన్ను ఎన్నుకున్నందుకు అసెంబ్లీలోని ఎమ్మెల్యేలు అందరికి దన్యవాదాలు. ఈమేరకు సహకరించిన ఏఐసీసీ అధినేత సోనియాగాంధీ, ఖర్గే, రాహుల్‌, ప్రియాంక, ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, మంత్రులు, ప్రతిపక్షనేత కె.చంద్రశేఖర్‌రావుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయను. బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తా. వ్యవస్థను అధ్యయనం చేయడం ద్వారా శాసనసభను సరైనదారిలో నడిపిస్తా. అందరి సహకారం తీసుకుంటా.
స్పీకర్‌గా మీ తొలి ప్రాధాన్యత ఏమిటి ?
అసెంబ్లీ స్పీకర్‌గా నా తొలి ప్రాధాన్యత సభలో ప్రజాసమస్యలపై విస్త్రృతమైన చర్చకు అవకాశమివ్వడం. అధికార, ప్రతిపక్షాలకు నిబంధనల మేరకు సమయాన్ని కేటాయిస్తూ సమస్యల పరిష్కారానికి కృషిచేయడం. సమయం వృధా కాకుండా చూసుకోవడం. ఈ విషయంలో శాసనసభ వ్యవహారాల మంత్రి, అసెంబ్లీ కార్యదర్శి, ఇతర అధికారుల సలహాలు, సూచనలు తీసుకుంటా. సభానాయకుడు, ప్రతిపక్ష నేతతో సమన్వయం చేసుకుంటూ సభను సజావుగా ముందుకుతీసుకుపోతా. అసెంబ్లీ హుందాతనాన్ని కాపాడతా. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తా. చర్చల ఫలితాలు ప్రజలకు దక్కేలా చూస్తా.
గతంలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ సరిగ్గా నిర్వహించడంలేదనే విమర్శలు ఉన్నాయి కదా ?
నేను మూడుసార్లు వికారాబాద్‌ నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించాను. సభాసంప్రదాయాలపై అవగాహన ఉంది. ఇంకా పెంచుకుంటా. గతంలో ప్రశోత్తరాలు, జీవరో అవర్‌ జరిగిన తీరు కూడా తెలుసు. సభా మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రశోత్తరాల కార్యక్రమాన్ని చేపడతాం.ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరేలా సభనడుస్తుంది. ప్రతిపక్షాలకూ అవకాశం ఉంటుంది. మహిళా ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకుని సమయం అదనంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అంతిమంగా సభ ప్రజాశ్రేయస్సుకు ఉపయోగపడుతుంది.
అసెంబ్లీ నిర్వహణలో బీఏసీ కీలకం, అందులో జరిగిన నిర్ణయాలు అమలు చేస్తారా ?
అవును నిజమే. బీఏసీ శాసనసభ నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో స్పీకర్‌, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, అన్ని పార్టీలు, అసెంబ్లీ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. సభా నిర్వహణకు సంబంధించి అన్ని అంశాలపై బీఏసీలో చర్చిస్తారు. ఇందులో జరిగిన ప్రతినిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేస్తాం. ప్రజల కష్ట, నష్టాలు సభలో చర్చకు రావాలంటే బీఏసీ కీలకం. పద్దులపై సుదీర్ఘంగా చర్చ నడుస్తుంది. బడ్జెట్‌ తదితర అంశాలపైనా కీలకంగా మాట్లాడతాం. ఈనేపథ్యంలో బీఏసీకి చాలా ప్రాధాన్యత ఉంది.
ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల తొలిరోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్పీకర్‌ ఆధ్వర్యంలో ‘తేనీటివిందు’ నిర్వహణ సాంప్రదాయం ఉండేది. దాన్ని పునరుద్దరించే అవకాశం ఉందా ?
ఇది మంచి సంప్రదాయమే. దీనిపై ముఖ్యమంత్రి, కార్యదర్శితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
సభ్యుల ప్రశ్నలకు జవాబులు పంపడం లేదనే అరోపణలు ఉన్నాయి కదా ?
అసెంబ్లీలో స్సీకర్‌గా నేను పూర్తిస్థాయిలో, పారదర్శకతతో, బాధ్యతగా పనిచేస్తా. సభా నిబంధనల ప్రకారం సభను కచ్చితంగా నడిపిస్తాం. జీరో అవర్‌ను బీఏసీ నిర్ణయం ప్రకారం కొనసాగిస్తాం. శాసనసభ్యులు వేసే జీరో అవర్‌ ప్రశ్నలకు మంత్రులచేత సమాధానాలు రాబడతాం. అంతేగాక వాటి సమాధానాలు ఎమ్మెల్యేలకు అందేలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఎక్కడా రాజీపడబోం.
పార్లమెంటులో అగంతకుల చొరబాటుపై మీ కామెంట్‌ ?
నో కామెంట్‌. ఒక్కటి మాత్రం చెప్పగలను. తెలంగాణ శాసనసభ భద్రతపై సమీక్షిస్తాం. సీఎంగారితో కలిపి బీఏసీలోనూ చర్చిస్తాం. ఇప్పుడు మూడంచెల భద్రతా వ్యవస్థ అమల్లో ఉంది. దాన్ని మరింత పటిష్టం చేస్తాం. ఇబ్బందులు రాకుండా పకడ్బంధి చర్యలు తీసుకుంటాం.
మీడియాకు సరైన గౌరవం దక్కడం లేదనే విమర్శలున్నాయి ?
మీడియాను తప్పకుండా గౌరవిస్తాం. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో ఎలాంటి గౌరవం దక్కిందో దాన్ని పునరుద్దరిస్తాం.