విద్యా వ్యవస్థ బలోపేతానికే ‘చర్చా వేదికలు’

'Discussion forums' to strengthen the education system– అందులో వచ్చిన అంశాలతో ఓ పాలసీ తయారు చేస్తాం: రాష్ట్ర విద్యా కమిషన్‌ చైర్మెన్‌ ఆకునూరి మురళి
నవతెలంగాణ-భూపాలపల్లి
విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకే విద్యా కమిషన్‌ జిల్లాల్లో చర్చా వేదికలు నిర్బహిస్తున్నట్టు రాష్ట్ర విద్యా కమిషన్‌ చైర్మెన్‌ ఆకునూరి మురళి తెలిపారు. శుక్రవారం జయశంకర్‌-భూపాలపల్లి జిల్లాలోని ఐడీఓసీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమగ్ర విద్యా విధానంపై ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర వర్గాల ప్రజలతో చర్చా, సూచనలు సలహాల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా కమిషన్‌ పదవీ బాధ్యతలు చేపట్టి రెండు నెలలు అయిందని, ఇప్పటి వరకు దాదాపు 70 సమావేశాలు నిర్వహించినట్టు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, యూనివర్సిటీలు, కార్పొరేట్‌ స్కూల్స్‌, కాలేజీల్లో పర్యటిస్తూ టీచర్స్‌, లెక్చరర్స్‌, యూనివర్సిటీ ఫ్యాకల్టీలతోపాటు క్షేత్రస్థాయిలో పర్యటనలు కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నేడు విద్యారంగ పరిస్థితి దయనీయంగా ఉందని, గత పాలకులు చేసిన అరాచకాలతో విద్యా వ్యవస్థ దెబ్బతిన్నదని అన్నారు. విద్యావ్యవస్థపై దేశంలో ప్రతి 2,3 ఏండ్లకు చేసే సర్వేల్లో మన రాష్ట్రం 32 స్థానంలో ఉందని తెలిపారు. దీన్ని బట్టి రాష్ట్ర విద్యా వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు. కేరళ, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పర్యటిస్తూ అక్కడి విద్యా విధానంపై స్టడీ చేసి ప్రభుత్వానికి పాలసీ అందజేయనున్నట్టు చెప్పారు.
అనంతరం జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మాట్లాడుతూ.. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్యమైన శిక్షణ, ఉపాధి కల్పన కోసం విద్యలో నూతన సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు తెలిపారు. అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ సంవత్సరం ఉచిత పాఠ్య పుస్తకాలు, రెండు జతల ఉచిత యూనిఫామ్‌ అందించినట్టు చెప్పారు. అనంతరం కమిటీ సభ్యులు జ్యోత్స్నారెడ్డి మాట్లాడుతూ.. చర్చకు వచ్చిన ప్రతి విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని, మంచి సలహాలు, సూచనలు ఇచ్చారని అభినందించారు. కమిటీ సభ్యులు వెంకటేష్‌ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసిన కమిషన్‌ ప్రతి నిత్యం సంస్థలతో, అనుభజ్ఞులతో సమాలోచనలు చేస్తూ ముందుకు పోతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు వల్ల ఇతర వర్గాల్లో తత్సంబంధాలు ఉండటం లేదని, ఆ కోణంలోనే ఆలోచన చేసి సమీకృత పాఠశాలల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాణ్యమైన విద్యా విధానాన్ని అందుబాటు లోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. కాగా, మహదేవపూర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు సాయి ప్రదీప్తిక, అన్విత ప్రదర్శించిన నేత్రావదానం చర్చా వేదికలో ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. వారిని చైర్మెన్‌, జిల్లా కలెక్టర్‌, కమిటీ సభ్యులు అభినందించారు. ఈ చర్చా వేదికలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్‌, డీపీఆర్వో శ్రీనివాస్‌, ఎస్సీ, బీసీ సంక్షేమ అధికారులు సునిత, శైలజ తదితరులు పాల్గొన్నారు.