మల్లన్నసాగర్‌ నిర్వాసితులపై కేసుల కొట్టివేత

మల్లన్నసాగర్‌ నిర్వాసితులపై కేసుల కొట్టివేత– నిర్వాసితులు, నాయకులను సన్మానించిన సీపీఐ(ఎం)
నవతెలంగాణ-సిద్దిపేట
మల్లన్న సాగర్‌ నిర్వాసిత రైతులు, సీపీఐ(ఎం), ఇతర రాజకీయ పార్టీల నాయకులపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను సిద్దిపేట కోర్టులో జడ్జి సోమవారం కొట్టేశారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలంలో అప్పటికే పోరాటం చేస్తున్న నిర్వాసితులపైనా, వారికి మద్దతు తెలిపిన సీపీఐ(ఎం), ఇతర రాజకీయ పార్టీల నాయకులపైనా 2016లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి, జైలుకు పంపింది. 8 సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా కోర్టుకు తిరుగుతున్నామని, సోమవారం సిద్దిపేట జిల్లా కోర్టులో కేసులను కొట్టేశారని బాధితులు తెలిపారు. వారందరికీ సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మల్లన్నసాగర్‌ కోసం 14 గ్రామాల ప్రజల నుంచి అక్రమంగా భూసేకరణకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడిందని, దానికి వ్యతిరేకంగా సీపీఐ(ఎం) ముందు నిలిచి ప్రజలను చైతన్యం చేస్తూ పోరాటం చేసిందన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న వారిపై అప్పటి ప్రభుత్వం కక్షగట్టి అక్రమ కేసులు బనాయించిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మల్లన్న సాగర్‌ నిర్వాసితులకు రావలసిన న్యాయమైన నష్ట పరిహారాలను వెంటనే మంజూరు చేసి, నిర్వాసితులందరినీ ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. మల్లన్నసాగర్‌ పోరాటంలో సహకరించిన ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులకు, కోర్టులో వాదించిన న్యాయవాది రాజలింగం, వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.