– నిబంధనలకు విరుద్ధంగా ఉన్నారని పేర్కొన్న ప్రభుత్వం
– 11 మందిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ
– కొత్త డైరెక్టర్లను నియమించే వరకూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ హయాంలో నియమితులైన 11 మంది విద్యుత్ పంపిణీ సంస్థల డైరెక్టర్లకు ప్రభుత్వం ఉద్వాసన పలికింది. తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీఎస్‌ఎస్‌పీడీసీఎల్)కు చెందిన ఏడుగురు, తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌కు చెందిన ఐదుగురు డైరెక్టర్లను తొలగిస్తూ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డైరెక్టర్ల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు 18, 45 ప్రకారం వారి పదవీ కాలం రెండేండ్లుగా పరిగణిస్తారు. సంస్థ అవసరాల దృష్ట్యా ఆ కాలాన్ని ఒక సంవత్సర చొప్పున రెండు సార్లు పొడగించడానికి అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఏ డైరెక్టరయినా గరిష్టంగా 4 ఏండ్లకు మించి పదవిలో కొనసాగడానికి వీలు లేదు. అయితే గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వారి పదవి కాలాన్ని ఇష్టానుసారంగా పొడిగించింది. సదరన్ సంస్థకు చెందిన టి.శ్రీనివాస్, నార్తన్ సంస్థకు చెందిన బి.వెంకటేశ్వర్ల నియామకమే నిబంధనలకు విరుద్దంగా జరిగిందని ప్రబుత్వం పేర్కొంది. వారు ఏకంగా పదేండ్లకు పైగా కొనసాగుతున్నారని తెలిపింది. వీరిద్దరి తర్వాత జె.శ్రీనివాస్ రెడ్డి తొమ్మిదేండ్ల రెండు నెలలు పదవిలో ఉన్నారు. జి.పర్వతం, సీహెచ్. మదన్‌మోహన్ రావు, ఎస్.స్వామిరెడ్డి, పి.మోహన్‌రెడ్డి, పి.సంధ్య, పి.గణపతి ఐదేండ్ల నాలుగు నెలలుగా డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఒక్క గంప గోపాల్ మాత్రమే రెండు సంవత్సరాల ఐదు నెలలుగా పదవిలో ఉన్నారనీ, ఇతన్ని గత సర్కార్ 23 జులై 2021లో డైరెక్టర్‌గా నియమించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నియమించబడిన డైరెక్టర్లను తొలగిస్తూ జారీ చేసిన ఈ ఉత్తర్వు వెంటనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. కొత్త డైరెక్టర్ల నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇరు సంస్థలు వారి స్థానాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. కొత్త వారి ఎంపిక కోసం ప్రభుత్వ నిబంధనలకు అనుగునంగా నోటిఫికేషన్ జారీ చేసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.