ఉపాధి నుంచి ఐదు కోట్లమంది తొలగింపు

From employment Five crore layoffs– రికార్డు స్థాయిలో ”జాబ్‌ కార్డులపై కోత
– వార్షిక సగటు కంటే అధికంగా వేటు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
2022-23లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) డేటాబేస్‌ నుంచి జాబ్‌ కార్డ్‌ల తొలగింపులో రికార్డు పెరుగుదల నమోదు అయింది. లిబ్‌టెక్‌ ఇండియా పరిశోధనా సంస్థ రిపోర్ట్‌ స్పష్టం చేసింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు 2022-23లో ఉపాధి హామీ డేటాబేస్‌ నుండి ఐదు కోట్ల జాబ్‌ కార్డ్‌లను తొలగించాయి. ఇది డ్యూ ప్రొసీజర్‌ను ఉల్లంఘించిందని సూచిస్తుందని తెలిపింది. ఇది వార్షిక సగటు 1 కోటి నుంచి 1.5 కోట్ల తొలగింపుల కంటే చాలా ఎక్కువని పేర్కొంది.
లిబ్‌టెక్‌ సంస్థ దేశం గ్రామీణ ప్రజా సేవల పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య విధానాన్ని మెరుగుపరచడానికి వివిధ అంశాలపై దృష్టి పెడుతుంది. లిబ్‌టెక్‌ ఇండియా అక్టోబర్‌ 2022- జూన్‌ 2023 మధ్య తెలంగాణ,,ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, ఒడిశా,, జార్ఖండ్‌లలో కార్డ్‌లు తొలగించబడిన 600 మంది కార్మికులను ఇంటర్వ్యూ చేయడంతో ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ నిర్వహించింది. మొత్తం 600 తొలగింపులలో నియమాలు ఉల్లంఘించబడ్డాయని, 380 సందర్భాలలో ఉదహరించిన కారణాలు తప్పుగా ఉన్నాయని గుర్తించింది.
అయితే, నకిలీ కార్డులు, మరణాలు, కార్డ్‌ హౌల్డర్లు పథకం కింద పని చేయడానికి ఇష్టపడకపోవడం వంటి కారణాలను పేర్కొంటూ, ఇది సాధారణ నవీకరణ అని ప్రభుత్వాలు పేర్కొన్నాయి. లిబ్‌టెక్‌ ఇండియా పరిశోధకురాలు లావణ్య తమంగ్‌ 2022-23లో భారీ సంఖ్యలో తొలగింపులను ఉదహరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా సంఖ్యలను సరిచేయాలని సూచించాయి. ఇది ఆధార్‌ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఏబీపీఎస్‌)తో ఉపాధి హామీ వేతన చెల్లింపులు జరిగేలా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి వల్లే ఇలా జరిగింది. ”కేంద్రగ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 100 శాతం ఏబీపీఎస్‌ చేయాలని పట్టుబట్టడంతో రాష్ట్రాలు జాబ్‌ కార్డుల తొలగింపును వేగవంతం చేసినట్టు కనిపిస్తోంది” అని తమంగ్‌ అన్నారు.
వంద శాతం ఏబీపీఎస్‌ కోసం కార్డులు తొలగింపు
ఏబీపీఎస్‌ సమ్మతిని సాధించడానికి, ఉద్యోగి ఆధార్‌ నంబర్‌ తప్పనిసరిగా వారి జాబ్‌ కార్డ్‌, బ్యాంక్‌ ఖాతాకు లింక్‌ చేయబడాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వాలతో సులభతరం చేయడం జరుగుతుంది. బ్యాంకు సంస్థాగత గుర్తింపు సంఖ్యకు లింక్‌ చేయబడింది. ఈ గజిబిజి ప్రక్రియను నివారించడానికి రాష్ట్రాలు తొలగింపును సులభమైన ఎంపికగా గుర్తించాయి.
జాబ్‌ కార్డులు తొలగింపులో నిబంధనలకు పాతర
ఉపాధి హామీ కింద జారీ చేయబడిన వార్షిక మాస్టర్‌ సర్క్యులర్‌లు (ఎఎంసీలు) 13 నిర్దిష్ట కారణాలపై జాబ్‌ కార్డ్‌ రద్దులను అనుమతిస్తాయి. అయితే జాబ్‌కార్డుల జోడింపు, తొలగింపు సంబంధిత గ్రామసభ ముందు తప్పనిసరిగా సమర్పించాలి. ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ ఎక్సర్‌సైజ్‌లో 600 డిలీట్‌లలో గ్రామసభలను సంప్రదించలేదని తేలిందని తమంగ్‌ చెప్పారు.
హౌల్డర్‌ తొలగింపు కోసం దరఖాస్తు చేస్తే జాబ్‌ కార్డ్‌లను రద్దు చేయవచ్చు. పంచాయతీ స్థాయి ఉపాధి హామీ అధికారి గ్రామసభకు తెలియజేసిన తరువాత కూడా చేయవచ్చు. ”చాలా సందర్భాలలో పంచాయతీలో పనిచేయడానికి ఇష్టపడకపోవడం, పనికి వెళ్లకపోవడం వంటి కారణాలను రాష్ట్రాలు ప్రస్తావించారు. ధృవీకరణ తర్వాత, ఇంటర్వ్యూ చేసిన 600 మంది కార్మికులలో 380 మంది విషయంలో అధికారిక పత్రాలలో ఉదహరించిన కారణాలు నిజం కాదని మేము కనుగొన్నాము” అని తమాంగ్‌ తెలిపారు.జనవరి 2023లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2023 ఫిబ్రవరి 1 నుంచి ఉపాధి హామీలో అన్ని వేతన చెల్లింపులను ప్రాసెస్‌ చేయడానికి ఏబీపీఎస్‌ ని ఉపయోగించాలని తప్పనిసరి చేసింది. అయితే, ఈ ఆదేశాలు ఇచ్చే సమయంలో, ఉపాధి హామీ కార్మికులు కేవలం 43 శాతం మాత్రమే ఏబీపీఎస్‌ చెల్లింపులకు అర్హులు.
100 శాతం ఆధార్‌ సీడింగ్‌ (కార్మికులు తమ ఆధార్‌ వివరాలను తమ జాబ్‌ కార్డ్‌లకు లింక్‌ చేయడానికి సమర్పించే ప్రక్రియ) సాధించడానికి కేంద్ర మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన ఒత్తిడి, తక్కువ వ్యవధిలో ప్రామాణీకరణ ఉపాధి హామీ డేటాబేస్‌ నుంచి కార్మికుల తొలగింపులలో గణనీయమైన పెరుగుదలకు దారితీసింది.
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ 2023 జూలై 25న లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం ఉపాధి హామీ జాబ్‌ కార్డ్‌ల మొత్తం తొలగింపు 2021-22లో 1.5 కోట్లు కాగా, 2022-23లో 5.18 కోట్లకు చేరుకుంది. 2022-23లో 83 లక్షల జాబ్‌ కార్డుల తొలగింపుతో పశ్చిమ బెంగాల్‌ అగ్రస్థానంలో నిలిచింది. ”జాబ్‌ కార్డ్‌ల తొలగింపుకు సంబంధించిన వివిధ కారణాల్లో. నకిలీ జాబ్‌ కార్డ్‌ (తప్పు జాబ్‌ కార్డ్‌)., డూప్లికేట్‌ జాబ్‌ కార్డ్‌. , పని చేయడానికి ఇష్టపడకపోవడం., గ్రామ పంచాయితీ నుంచి కుటుంబాన్ని శాశ్వతంగా మార్చాడం. జాబ్‌ కార్డ్‌లోని ఉన్న ఒకే వ్యక్తి మరణించడం” అని సమాధానంలో తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరితోనే ఉపాధి హామీ నిర్వీర్యం: బి.వెంకట్‌
కేంద్ర ప్రభుత్వ వైఖరితోనే ఉపాధి హామీ నిర్వీర్యం అవుతుందని ఎఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ విమర్శించారు. జాబ్‌ కార్డులు తొలగించి, ఈ పథకాన్నే అటకెక్కించేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందని దుయ్యబట్టారు. జాబ్‌ కార్డులు తొలగింపుకు సరైనా కారణాలు చెప్పటం లేదని, ఏబీపీఎస్‌ విధానంతో జాబ్‌ కార్డులు తగ్గిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాలకు ఉపాధి హామీ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయని, వాటిని విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. మరోవైపు ఉపాధి హామీకి బడ్జెట్‌ కేటాయింపులు కూడా తగ్గించారని, దీంతో ఆ పథకాన్ని అటుకెక్కించేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. కేంద్ర కేటాయింపులు పెంచటంతో పాటు జాబ్‌ కార్డుల తొలగింపును ఆపాలని డిమాండ్‌ చేశారు.