శృంగభంగం

Disruptionసార్వత్రిక ఎన్నికలలో చావుతప్పి కన్ను లొట్టపోయిన బీజేపీకి నిన్నటి ఉపఎన్నికలు మరింత శృంగభంగం కలిగించాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌కు తొలి పరీక్షగా భావించిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ‘ఇండియా బ్లాక్‌’ జయకేతనం ఎగురవేసింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఇండియా బ్లాక్‌ 10 చోట్ల విజయం సాధించి, బీజేపీని రెండు స్థానాలకే పరిమితం చేసింది. మరో చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. జులై10న పశ్చిమ బెంగాల్‌లోని నాలుగు, హిమాచల్‌ ప్రదేశ్‌లోని మూడు, ఉత్తరాఖండ్‌లోని రెండు, పంజాబ్‌, బీహార్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లోని ఒక్కొక్క స్థానానికి ఉపఎన్నిక జరిగిన విషయం విధితమే. శనివారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచే ఇండియా బ్లాక్‌ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగారు. ఫిబ్రవరి 27న జరిగిన రాజ్యసభ ఎన్నికలలో హిమాచల్‌ ప్రదేశ్‌లో ఫిరాయిం పులను ప్రోత్సహించడం ద్వారా అనైతిక విజయం సాధించిన బీజేపీకి ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికలలో ప్రజలు తగిన పాఠం చెప్పారు.
ఇందులో నాలుగు రాష్ట్రాల్లో ఇండియా బ్లాక్‌ అధికారంలో ఉండగా, మూడుచోట్ల ఎన్డీయే ప్రభుత్వం ఉంది. పశ్చిమబెంగాల్‌లో రారుగంజ్‌, రాణాఘాట్‌, బాగ్దా, మాణిక్తలా నాలుగు స్థానాల్లోనూ తృణమూల్‌ అభ్యర్థులు విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికలలో ఉత్తరాఖండ్‌లో ఐదు ఎంపీ స్థానాలను గెలుచుకున్న కాషాయ పార్టీకి ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంగలౌర్‌, బద్రీనాథ్‌ స్థానాలలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. మొన్న అయోధ్యలో…నిన్న బద్రీనాథ్‌లో సైతం కాషాయ పార్టీని ప్రజలు ఓటు ఆయుధంతో తిప్పికొట్టారు. ప్రఖాత్య హిందూ దేవాలయాలు ఉన్న చోట కూడా బీజేపీ ఓటమిపాలవడం గమనార్హం. ఇది దాని ‘ హిందూత్వ’ భావజాలాన్ని హిందువులు కూడా ఆమోదించడం లేదనడానికి నిదర్శనం. బద్రీనాథ్‌ కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీలోకి మారారు.ఈ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించడం ద్వారా ఆయనకి తగిన బుద్ది చెప్పారు. తాజాగా ఇద్దరి గెలుపుతో 68 మంది సభ్యులున్న హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం 40కి చేరింది.2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 40 సీట్లు నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి క్రాస్‌ ఓటింగ్‌ వేయడంతో సుఖు ప్రభుత్వాన్ని అస్థిరత వెంటాడింది. లోక్‌సభ ఎన్నికలతో పాటే 6 స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ నాలుగు నెగ్గింది. ఇప్పుడు మరో రెండు స్థానాలు గెలవడంతో కాంగ్రెస్‌ బలం మళ్లీ 40కి చేరింది. రాజీనామాచేసి బీజేపీ తీర్ధం పుచ్చుకున్న ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో భారీ మూల్యమే చెల్లించుకున్నారు. దేహ్రాలో సీఎం సతీమణి కమలేశ్‌ ఠాకుర్‌ బీజేపీపై విజయం సాధించారు.నాలాగఢ్‌ స్థానంలో కాంగ్రెస్‌ గెలుపొందగా… హమీరుర్‌ స్థానంలో మాత్రమే బీజేపీ గెలుపొందింది.
పంజాబ్‌ జలంధర్‌ స్థానంలో ఆప్‌ అభ్యర్థి మోహిందర్‌ భగత్‌ బీజేపీపై ఏకంగా 37వేల ఓట్ల మెజారిటీతో విజయం నమోదు చేశారు. తమిళనాడులోని విక్రావండి స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియుర్‌ శివ విజేతగా నిలిచారు. మధ్యప్రదేశ్‌లోని అమర్వాడాలో బీజేపీ అభ్యర్థి కమలేశ్‌ షా గెలిచారు. బీహార్‌లోని రూపాలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంక్‌ సింగ్‌ జయకేతనం ఎగురవేశారు. మొత్తంగా ఈ ఫలితాలు మసకబారుతున్న ”బ్రాండ్‌ మోడీ” ఇమేజేన్‌ను ఎత్తిచూపుతున్నాయి.
రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌, ఢిల్లీ, బీహార్‌) ఒకరకంగా ఇది రిహార్సల్స్‌గా భావించవచ్చు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతిపక్షాలు మరింత ఐక్యంగా వ్యవహరించాలని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అనాలోచిత విధానాల వలన సార్వత్రిక ఎన్నికలలో ఇండియా బ్లాక్‌ తగిన ఫలితాలు రాబట్టలేకపోయింది. ఈ ఉపఎన్నికలలో వచ్చిన ఫలితాలతోనైనా కాంగ్రెస్‌ పార్టీ మేల్కొని ప్రతిపక్షాల మధ్య మరింత ఐక్యతకు కృషి చేయాలి. అవసరమైతే ఆ పార్టీ కొన్ని త్యాగాలకు కూడా సిద్ధపడాలి.ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్యతో నిమిత్తం లేకుండా అన్ని పార్టీలకు సీట్లను కేటాయించాలి. అప్పుడే ఇండియా బ్లాక్‌ ఓట్లు చీలిపోవు. కేంద్రంలో ప్రస్తుతం ఉన్నది సంకీర్ణ ప్రభుత్వం అన్న మాట మరిచి తన సొంత పార్టీ ప్రభుత్వంగా వ్యవహరిస్తూ మోడీ చేసే ప్రయత్నాలను తిప్పికొట్టే విధంగా ఉద్యమించాలి. మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల దష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాలి. కార్మికులు, రైతులు, దళితులు, గిరిజనులు సమాజంలోని అణగారిన వర్గాలలో చైతన్యానికి కృషి చేయాలి. ప్రతిపక్షం ఐక్యంగా చర్చించి సమష్టి వ్యూహంతో వ్యవహరించకపోతే మోడీ మరింత దుష్పరిపాలన సాగించే అవకాశముందన్న విషయాన్ని కాంగ్రెస్‌ గమనంలో ఉంచుకోవాలి.