– కార్యకర్తను ఢకొట్టిన ఎమ్మెల్యే కారు
– పట్టించుకోకుండా పోయిన ఎమ్మెల్యే
– బాధితున్ని ఏరియా ఆస్పత్రిలో చేర్పించిన స్థానికులు
– నాయకులు తీరుతో కార్యకర్తల్లో ఆగ్రహం
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిర్యాలగూడలో శుక్రవారం జరిగిన మంత్రుల పర్యటనలు అపశృతి నెలకొంది. స్థానిక ఏరియా ఆస్పత్రిలో సుమారు 14 కోట్లతో నిర్మిస్తున్న ఆస్పత్రి నూతన భవనానికి శంకుస్థాపన చేసినందుకు ఆర్థిక , వైద్య ఆరోగ్యశాఖ, విద్యుత్‌శాఖ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిలు హాజరైనారు. ఏరియా ఆస్పత్రిలో శంకుస్థాపన కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళుతుండగా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ కారు కార్యకర్తను ఢకొట్టింది. శంకుస్థాపన కార్యక్రమం చూసేందుకు వచ్చిన మిర్యాలగూడ మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన సైదులు నడుచుకుంటూ వెళుతుండగా కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళుతున్న ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కారు కార్యకర్త సైదులు కాలు పైనుంచి వెళ్ళింది. దీంతో కార్యకర్త అక్కడే పడిపోయాడు. సంఘటన జరిగినట్టు తెలిసినప్పటికీ కార్యకర్తను పట్టించుకోకుండా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అలాగే వెళ్ళిపోయాడు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు బాధితున్ని సైదులను ఏరియా ఆస్పత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స అందించారు. కార్యకర్తను ఢ కొట్టి పట్టించుకోకుండా వెళ్లిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పై కార్యకర్తలు, పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలనే పట్టించుకోలేని నాయకులు ప్రజలను ఏమి పట్టించుకుంటారని చెవులు కోరుకుంటున్నారు.
హరీశ్‌రావు శాఖ మార్చిన భాస్కరరావు
ఆత్మీయ సమ్మేళనంలో నవ్వులు
ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శాఖను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మార్చారు. శుక్రవారం మిర్యాలగూడలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు మాట్లాడే ముందు భాస్కర్‌రావు మాట్లాడారు. కొన్ని సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరగా అదే విధంగా నిధులు మంజూరు చేయాలని కోరారు. విద్యుత్‌శాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడతారని చెప్పగా అప్పుడే మైక్ అందుకున్న మంత్రి హరీశ్‌రావు నా శాఖనే మార్చేశావు అంటూ చిరునవ్వు నవ్వారు. దీంతో సభలో ఉన్న ప్రజలందరూ ఒక్కసారిగా నవ్వడంతో సభ ప్రాంగణం అంతా నవ్వులు పువ్వులుగా మారింది. తప్పు తెలుసుకున్న భాస్కర్‌రావు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడతారని చెప్పి తన తప్పును సరి చేసుకున్నారు.