న్యూఢిల్లీ: మెటా సంస్థకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా వేదికలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్, మెసెంజర్ సర్వీసు సేవలకు మంగళవారం అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సేవలను వినియోగించుకునే కోట్లాదిమంది ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచే ఈ అంతరాయాలు ప్రారంభమయ్యాయి. దీంతో అనేక మంది ఖాతాదారులు ఎక్స్ (గతంలో ట్విట్టర్) తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి ఆకస్మాత్తుగా లాగవుట్ అవుతున్నామని, లేదా వీటిని లాగిన్ అవ్వడం సాధ్యంకావడం లేదని ఫిర్యాదు చేశారు. నిత్యజీవితంలో ఒక భాగంగా మారిన ఈ సర్వీసులకు అంతరాయం ఏర్పడ్డంతో త్వరగా సర్వీసులు పునరుద్దరించాలంటూ విజ్ఞప్తులు చేశారు. అలాగే తమ ఒక్కరికే ఈ పరిస్థితి వచ్చిందా.. అందరికీ ఇలాంటి పరిస్థితి ఎదురువుతుందా అని ఆరా తీస్తున్నారు. మరోవైపు మెటా సంస్థ కూడా ఈ అంతరాయంపై స్పందించింది. మెటా కమ్యూనికేషన్స్ ప్రతినిధి ఆండీ స్టోన్ ‘ప్రజలు మా సేవలను పొందడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారని మా దృష్టికి వచ్చింది. ఈ సమస్యపైనే మేం ఇప్పుడు పని చేస్తున్నాం’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే సేవల పునరుద్ధరణకు ఇంకా ఎంత సమయం పడుతుందనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు.