– గుంభనంగా ఆశావహులు
– మౌనం వెనుక ఆంతర్యమేంటి..?
– అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే ఛాన్స్
నవతెలంగాణ-సిటీబ్యూరో
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఆశావహులు అంతర్మ థనంలో పడ్డారు. ధిక్కార స్వరం వినిపించలేకపోతున్నారు. మొన్నటి వరకు తమకే టికెట్లు వస్తాయని ఆశించిన నాయకులకు అధిష్టానం మొండి చేయి చూపింది. ఆశావ హులు పునరాలోచ నలో పడ్డారు. టికెట్ దక్కకపోవడంతో చేసేదేమీ లేక మౌనం దాల్చారు. బుజ్జగింపు కూ నోచుకోవడం లేదు. రాయబారాలు లేవు. అసంతృప్తితో లోలోపల తీవ్ర మనోవేదనకు గురవుతున్నా.. బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆశావహుల మౌనం వెనుక ఆంతర్యం ఏముందో.. కార్యకర్తలకు కూడా అర్థం కావడం లేదు. ఇలాగే కొనసాగితే ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గాలకూ బీఆర్‌ఎస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ అవకాశం కల్పించగా.. ఉప్పల్ అభ్యర్థిని మాత్రమే మార్చారు. అయినా జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి నిరసనలు, ఆందోళనలు జరగడం లేదు. లోపల అసమ్మతి రాజుకుంటున్నా.. బయటకు రానీయడం లేదు. తమ సమీప కార్యకర్తల దగ్గర అధిష్టానం వ్యవహరించిన తీరు గురించి చెబుతూ.. పార్టీకి తాను చేసిన సేవ.. పార్టీ తనకు చేసిన అన్యాయం గురించి చర్చిస్తున్నారు. అధిష్టానం తీరు మారుతుందేమో అని కొందరు ఎదురు చూస్తున్నారు. ఇంకొందరు పార్టీని వీడేది లేదని బహిరంగంగానే చెబుతున్నారు. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, సీనియర్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి పోటీ పడ్డారు. చివరకు బీఆర్‌ఎస్ అధిష్టానం బండారి లక్ష్మారెడ్డి వైపే మొగ్గు చూపింది. కూకట్‌పల్లి నియోజవర్గంలో ముగ్గురు నాయకులు టికెట్ ఆశించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకే మళ్లీ అవకాశం రావడంతో ఎమ్మెల్సీ నవీన్‌రావు, గొట్టిముక్కల వెంకటేశ్వర్‌రావు సైలెంట్ అయ్యారు. ఇక్కడ వెంకటేశ్వర్‌రావు బీఆర్‌ఎస్ రెబెల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సైతం ఇద్దరు పోటీ పడగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకాంద్‌కే టికెట్ దక్కింది. ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు శంభీపూర్ రాజుకు నిరాశే మిగిలింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ధిక్కార స్వరం వినిపిస్తుండటంతో శంభీపూర్ రాజు అభ్యర్థి త్వంపై అధిష్టానం మరోసారి ఆలోచిస్తున్నట్టు సమాచారం.
మేడ్చల్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి, మలిపెద్ది సుధీర్‌రెడ్డి టికెట్ కోసం పోటీ పడ్డారు. కానీ అధిష్టానం మాత్రం మళ్లీ మల్లారెడ్డికే టికెట్ కేటాయించడంతో సుధీర్‌రెడ్డి పునరాలోచనలో పడ్డారు. సుధీర్‌రెడ్డి కుమారుడు జెడ్పీ చైర్మెన్‌గా కొనసాగుతున్నారు. తాను పార్టీ మారితే తన కుమారుడి రాజకీయ భవిష్యత్ ఏంటి..? తనతోపాటు ఇతర పార్టీలోకి తీసుకెళ్లాలా..? లేక తానొక పార్టీ, కుమారుడు మరో పార్టీలో కొనసాగాలా..? అని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇద్దరు వేర్వేరు పార్టీల్లో కొనసాగితే పరిస్థితులు ఎలా ఉంటాయని లెక్కలేసుకుంటున్నారు. ఇక మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తప్ప మరెవరూ టికెట్ కోసం ఆశ పడలేదు. చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి పోటీలో ఉన్నా.. పేరు అంతగా ప్రచారంలోకి రాలేదు. మల్కాజిగిరి టికెట్ మైనంపల్లికే వచ్చినా తన కొడుక్కి మెదక్ అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.
గెలుపోటములపై ప్రభావం
అసంతృప్తుల మౌనం ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రమాదంగా మారే అవకాశం లేకపోలేదు. ఇప్పటికిప్పుడు ధిక్కార స్వరం వినిపించి తిరుగుబాటు చేయకున్నా.. ఎన్నికల సమయంలో కలిసి పని చేయడం కష్టమే. టికెట్ ఆశించి భంగపడిన వారిని బుజ్జగించినా ఎన్నికల్లో మనస్ఫూర్తిగా ప్రచారం చేస్తారనే నమ్మకం లేదు. బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పని చేయాలని వారి వారి క్యాడర్‌కు ఆదేశాలు జారీ చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఇలాంటి పరిణామాలు ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపోట ములపై తీవ్ర ప్రభావం చూపొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడు తున్నారు. మరికొందరు సైలెంట్‌గా ఉండి చివరి నిమిషంలో రెబెల్‌గా పోటీలో ఉండే అవకాశాలు లేకపోలేదు.