– నవంబరు 21న కొత్త పార్లమెంట్ సమావేశం
కొలంబో : మధ్యంతర ఎన్నికలు జరిపేందుకు వీలుగా శ్రీలంక పార్లమెంట్‌ను నూతన అధ్యక్షుడు అనుర దిసనాయకె రద్దు చేశారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే ఇది అమలులోకి వచ్చింది. పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించి నవంబరు 21 కల్లా కొత్త పార్లమెంట్ సమావేశమవు తుందని ఆయన ప్రకటించారు. నవంబరు 14న పార్లమెంట్ ఎన్నికలు జరగ నున్నాయి. షెడ్యూల్ కన్నా దాదాపు ఏడాది ముందుగా ఈ ఎన్నికలు జరుగు తున్నాయి. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ బుధవారం నాడు వెలువడింది. ప్రజలు కోరుకున్న విధంగా లేనపుడు ఆ పార్లమెంట్‌ను కొనసాగించడంలో అర్ధం లేదని అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. 2020 ఆగస్టులో గత పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగంలోని 70వ అధికరణ కింద తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించి అధ్యక్షుడు ఈ చర్య తీసుకున్నారు.