ఖరీఫ్‌ లక్ష్యానికి ఆమడ దూరం

Distance to Kharif target– సీఎంఆర్‌ మిల్లింగ్‌లో నిర్లక్ష్యం
– నేటికీ అందని 2,826 మెట్రిక్‌ టన్నుల బియ్యం
– మిల్లులపై చర్యలు శూన్యం
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
2022-23 ఆర్ధిక సంవత్సరం కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) ఖరీఫ్‌ లక్ష్యాన్ని నేటికీ మిల్లర్లు చేరుకోలేదు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జనవరి 31 నాటికే సరఫరా చేయాల్సి ఉండగా, హన్మకొండ జిల్లాలో 7 రైస్‌మిల్లులు నేటికీ 2,826 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సరఫరా చేయలేదు. చట్టం ప్రకారం సీఎంఆర్‌ ఇవ్వని రైస్‌ మిల్లులపై క్రిమినల్‌ కేసులు పెట్టాల్సి ఉండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద లెవీ పెట్టడానికి మరింత గడువును పెంచుకునే ప్రయత్నం చేస్తుందనే సాకుతో నేటికీ రైస్‌మిల్లులపై సివిల్‌ సప్లరు అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దామెర మండలం ల్యాదెళ్ల గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ ఇండిస్టీస్‌ను ‘నవతెలంగాణ’ పరిశీలించగా, బియ్యం రాశులు, బస్తాలు పెద్ద ఎత్తున దర్శనమిచ్చాయి. ఉద్దేశపూర్వకంగానే మిల్లర్లు ప్రభుత్వానికి లెవీ పెట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న దానికి ఇది నిదర్శం. ఇదిలావుంటే లెవీ బియ్యం సరఫరా చేయడానికి గడువు నేటికీ పొడిగించలేదని హన్మకొండ పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ మహేందర్‌ చెబుతుండగా, శ్రీ అన్నపూర్ణ ఇండిస్టీస్‌ యజమాని కె. శ్రీధర్‌ లెవీ సేకరణ గడువును ఫిబ్రవరి 28వ తేదీ వరకు పొడిగించినట్టు రెండ్రోజుల క్రితమే ఉత్తర్వులు వచ్చాయని చెప్పడం గమనార్హం.
హన్మకొండ జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 61 రైస్‌మిల్లులకు రబీ సీజన్‌లో 34 రైస్‌మిల్లులకు మాత్రమే లెవీ బియ్యం సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. 2022-23 ఆర్ధిక సంవత్సరం ఖరీఫ్‌లో 90,930 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 88,570 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు లెవీగా సరఫరా చేశారు. మిగిలిన 2,826 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాల్సి ఉంది. జిల్లాలోని ఏడు రైస్‌మిల్లులు తుది గడువులోపు సీఎంఆర్‌ లెవీని సరఫరా చేయలేదు. ఖరీఫ్‌ సీజన్‌ లెవీ బియ్యాన్ని జనవరి 31వ తేదీలోపు సరఫరా చేయాల్సి ఉండగా, ఇప్పటికీ పూర్తి లెవీని సరఫరా చేయకపోవడం గమనార్హం. దామెర మండలం ల్యాదెళ్ల గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ ఇండిస్టీస్‌లో 493 మెట్రిక్‌ టన్నుల లెవీ బియ్యం సరఫరా చేయడానికి నేటికీ మిల్లింగ్‌ జరుగుతుంది. నడికూడ మండల కేంద్రంలోని సాయి సూర్య ఇండిస్టీస్‌ 580 మెట్రిక్‌ టన్నులు, ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లిలోని మహాలక్ష్మీ బిన్ని రైస్‌ మిల్లు 522 మెట్రిక్‌ టన్నులు, ఎల్కతుర్తి మండలం కేంద్రంలోని సాయిరాం ఇండిస్టీస్‌ 406, దామెర మండలంలోని ల్యాదెళ్ల గ్రామంలోని లక్ష్మీ గణపతి రైస్‌ ఇండిస్టీస్‌ 319, ఆత్మకూరు మండలకేంద్రంలోని వెంకటేశ్వర బిన్నీ రైస్‌ మిల్లు 174, ఐనవోలు మండలం నందనంలోని సాయిక్రిష్ణ ఇండిస్టీస్‌ 87 మెట్రిక్‌ టన్నుల లెవీని ప్రభుత్వానికి పెట్టాల్సి ఉంది.
గడువు పెంచకపోతే కఠిన చర్యలు
జనవరి 31వ తేదీలోపే ఖరీఫ్‌ సీజన్‌ లెవీ సరఫరా చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికీ 7 మిల్లులు లెవీ పెట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం లెవీ గడువు పెంచని పక్షంలో ఆ రైస్‌మిల్లులపై చర్యలు తప్పవు.
మహేందర్‌, డీఎం సివిల్‌ సప్లరు, హన్మకొండ
కామన్‌ రకంతో నష్టపోయాం
కామన్‌ రకం ధాన్యం మిల్లింగ్‌ చేయడంతో నష్టపోయాం. మూడు లారీలు లెవీపెడితే వాటిని తిరస్కరించడంతో తీవ్రంగా నష్టపోయాం. ఇప్పుడు లెవీ పెట్టడానికే మిల్లింగ్‌ చేస్తున్నాం. గడువు ఫిబ్రవరి 28 వరకు పెంచారు కాబట్టి సకాలంలో లెవీ బియ్యం సరఫరా చేస్తాం.
– కె. శ్రీధర్‌, శ్రీ అన్నపూర్ణ ఇండిస్టీస్‌, ల్యాదెళ్ల
లెవీ ఇవ్వని రైస్‌ మిల్లులపై చర్యలేవీ..?
లెవీ బియ్యం ఇవ్వడానికి తుది గడువు జనవరి 31 అయినా లెవీ ఇవ్వని 7 రైస్‌ మిల్లులపై నేటికీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. 2,826 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని లెవీ పెట్టకపోయినా పౌరసరఫరాల శాఖాధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. నిర్ధిష్ట గడువులోపు లెవీ సరఫరా చేయని మిల్లులపై రెవెన్యూ రికవరీ యాక్టు పెట్టడమే కాకుండా సీఎంఆర్‌ బియ్యం ధరపై 125 శాతం ధరతోపాటు, 12 శాతం వడ్డీని చెల్లించాలన్న నిబంధన ఉంది. నిబంధనల్లో స్పష్టత లేదన్న సాకుతో అధికారులు సైతం కాలయాపన చేస్తున్నారు.