చరిత్రను వక్రీకరించడమే..

Distorting history..– విమోచన దినోత్సవంపై కేంద్రం నోటిఫికేషన్‌ను
– ఉపసంహరించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలంటూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ను జారీ చేయటాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఇది చరిత్రను వక్రీకరించడమేనని విమర్శించింది. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా దీన్ని జారీ చేయటం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమేనని తెలిపింది. ఆ నోటిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో అణువంత సంబంధం కూడా లేని వారు ఇది విమోచన దినం అంటున్నారని విమర్శించారు. భూమి కోసం, భుక్తి కోసం, జమీందారీ వ్యవస్థ నుంచి విముక్తి కోసం భారత కమ్యూనిస్టు పార్టీ సారథ్యంలో పోరాటం సాగిందని గుర్తు చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు లాంటి నాయకులు నడిపిన పోరాటమని తెలిపారు. ఆ పోరాట సమయంలో నెహ్రూ-పటేల్‌ ప్రభుత్వం, నరహంతక నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌తో యధాతథ ఒప్పందం చేసుకున్నదని పేర్కొన్నారు. హైదరాబాద్‌ రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా గుర్తించిందని తెలిపారు. సాయుధ రైతాంగ పోరాటాన్ని అణచలేక, నిజాం రాజు చేతులెత్తేసే సమయంలో నెహ్రూ-పటేల్‌ ప్రభుత్వ సైన్యాలు తెలంగాణలోకి ప్రవేశించాయని పేర్కొన్నారు. ఎలాంటి ప్రతిఘటన లేకుండా నిజాం రాజు లొంగిపోయాడని తెలిపారు. హైదరాబాద్‌ రాజ్యాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేస్తూ సెప్టెంబర్‌ 17న సంతకం చేశాడని గుర్తు చేశారు. అందువల్ల అది ఇండియన్‌ యూనియన్‌లో హైదరాబాద్‌ రాజ్యం విలీనమైన రోజని పేర్కొన్నారు. మరోవైపు పటేల్‌ సైన్యాలు నరహంతక రజాకార్‌ నాయకుడు కాశీం రజ్వీని అరెస్టు చేసి మరణశిక్ష విధిస్తారని రైతాంగం ఆశించిందని తెలిపారు. కానీ సకల సౌకర్యాలతో పాకిస్తాన్‌కు పంపించారని తెలిపారు. అంతేకాదు, నరహంతక నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ను కూడా అరెస్టు చేయలేదనీ, ఆనాటి హోంమంత్రి సర్దార్‌ వల్లభారు పటేల్‌ ఆయన్ను రాజప్రముఖ్‌గా నియమించారని పేర్కొన్నారు. నిజాం రాజుతో కుమ్మక్కైన ఇండియన్‌ యూనియన్‌ సైన్యాలు రైతాంగం మీద హత్యాకాండ చేశాయని తెలిపారు. భయంకరమైన అణచివేత సాగించారని పేర్కొన్నారు. ఈ వాస్తవాల నుంచి కొత్తతరం ప్రజలను పక్కదోవ పట్టిస్తూ, ఆనాటి పోరాటానికి మతం రంగు పులిమే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ఆయన కోరారు.