నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సిద్ధిపేట నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేయడం లేదంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు వేసిన పిటిషన్‌ను జస్టిస్ శరత్ విచారించారు. సిద్ధిపేట నియోజకవర్గంలో చిన్నకోడూరులో 25, నంగునూరులో 38, సిద్ధిపేట అర్బన్‌లో 1, సిద్ధిపేట రూరల్‌లో 19, నారాయణరావుపేటలో 391 చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేయనీయకుండా మంత్రి కొండా సురేఖ అడ్డుపతున్నారని పిటిషనర్ వాదించారు. చెక్కులు చెల్లకుండా పోయే ప్రమాదముందన్నారు. వాదనల తర్వాత న్యాయమూర్తి సిద్ధిపేట నియోజకవర్గంలో షాదీముబారక్, కళ్యాణలక్ష్మి పథకాల కింద సిద్ధం చేసిన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశించారు.
బెయిల్ పిటిషన్‌పై వివరణ ఇవ్వండి
ఫోన్‌ట్యాపింగ్ కేసులో నాలుగవ నిందితుడిగా ఉన్న అదనపు డీసీపీ తిరుపతన్న బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. మార్చి నుంచి తిరుపతన్న జైల్లో ఉన్నారనీ, బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ జువ్వాడి శ్రీదేవి బుధవారం విచారించారు. పోలీసుల వాదనల నిమిత్తం విచారణను సెప్టెంబరు 4వ తేదీకి వాయిదా వేశారు.
వేణుస్వామికి సమన్లపై వివరణ ఇవ్వండి
జ్యోతిషుడు వేణుస్వామి సిన్మా హీరో నాగచైతన్య, శోభితాలపై చేసిన వ్యాఖ్యలపై స్టేట్ మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కమిషన్‌కు ఫిర్యాదు చేసిన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు, కమిషన్లలకు నోటీసులు జారీ చేసింది. విచారణను వచ్చే నెల రెండుకు వాయిదా వేస్తూ జస్టిస్ నంద ఉత్తర్వులు జారీ చేశారు.
పీహెచ్‌డీ అడ్మిషన్లు ఆపండి
కాకతీయ యూనివర్సిటీ ఈ నెల 16న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేసిన కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పాత నోటిఫికేషన్ ప్రకారం అడ్మిషన్లు చేస్తున్నారనే పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి జస్టిస్ వినోద్ కుమార్ ప్రతివాదులను ఆదేశించారు. నోటిఫికేషన్ ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ, విచారణ వాయిదా వేశారు.