మండలంలోని చౌట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు కళాశాలలో గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ సుప్రియ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, అంగన్వాడి కేంద్రాల్లో, ఐటిఐ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుప్రియ మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాల లోపు విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేసినట్లు ఆమె తెలిపారు. దీని ద్వారా పిల్లల్లో రక్తహీనత తగ్గుతుందని, తద్వారా పిల్లలు చాలా చురుకుగా, ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈరోజు పాఠశాలలకు హాజరు కాని విద్యార్థులకు ఈ నెల 27వ తేదీన ఆల్బెండజోల్ మాత్రలు వేస్తామని తెలిపారు.ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి సత్యనారాయణ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.