– చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్..
నవతెలంగాణ – వేములవాడ రూరల్: వేములవాడ అర్బన్ మండలంలోని భూ నిర్వాసితులకు మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్, ఎంపీపీ బుర్ర వజ్రవ్వ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మిడ్ మానేరు భూనిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని వారు చేసిన త్యాగం ఈరోజు జిల్లాలో వేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందిస్తుందని అన్నారు. త్వరలోనే ప్రభుత్వంతో చర్చలు జరిపి భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందేలా చూస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. భూ నిర్వాసితులకు ఉపాధి కొరకై పరిశ్రమ కేంద్రాలు వచ్చేలా చూస్తానని అన్నారు. రుద్రవరం, సంకేపల్లి ,అనుపురం భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఐదు కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్రవ్వ, జడ్పిటిసి రవి, సర్పంచులు వెంకటరమణ, ఊరడి రామ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు ప్రభాకర్ రెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు.