రేపే ‘డబుల్‌’ ఇండ్ల పంపిణీ

distribution-of-double-houses-tomorrow– ఏర్పాట్లలో నిమగమైన అధికారులు
– మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో లబ్దిదారులకు అందజేత
– గ్రేటర్‌లోని తొమ్మిది ప్రాంతాల్లో 13,800 మందికి ఇండ్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రెండో విడత డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పంపిణీకి అంతా సిద్ధమైంది. రెండో విడతకు ఎంపికైన లబ్దిదారులకు ఈ నెల 21న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను అందజేసేందుకు అవసరమైన ఏర్పాట్లను జీహెచ్‌ఎంసీ, కలెక్టరేట్‌ అధికారులు పూర్తి చేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ జరగ కుండా సంబంధిత అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేగాక లబ్దిదారులు ఉండే ప్రాంతాల నుంచి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు కేటాయించిన ప్రాంతాలకు వారిని తీసుకెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్‌ఐసీ రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా ర్యాండమైజేషన్‌ పద్ధతిలో ఆన్‌లైన్‌ డ్రా నిర్వహించి మొదటి విడతలో 11,700 మంది లబ్దిదారులను ఎంపిక చేసి.. ఈ నెల 2న 8 ప్రాంతాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇండ్లను పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
రెెండో విడతలో ఇటీవల హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో మంత్రు లు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆన్‌లైన్‌ డ్రా నిర్వహించి 11,700 మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. ఇందులో వికలాంగులు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ కోటా అమలు చేయగా.. వికలాంగులకు 470, ఎస్సీలకు 1,923, ఎస్టీలకు 655 కేటాయించగా.. ఇతరులకు 8,652 కేటాయించారు. స్థానిక కోటాలో మరో 2100 ఇండ్లు కలిపి మొత్తం 13,800 మందికి ఇండ్ల పంపిణీ చేపట్టనున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. డ్రాలో ఎంపికయిన లబ్దిదారులకు గురువారం గ్రేటర్‌లోని 9 ప్రాంతాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఇండ్లను పంపిణీ చేయనున్నారు.
‘డబుల్‌’ ఇండ్ల కేటాయింపు ప్రాంతాలు ఇవే..
కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని దుండిగల్‌లో మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ 2,100 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.
మహేశ్వరం నియోజకవర్గంలోని మన్‌సాన్‌ పల్లిలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 700 మంది లబ్దిదారులకు ఇండ్ల పత్రాలను అందజేస్తారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని అట్టిగూడలో భూగర్భ గనుల శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి 432 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు
ఇబ్రహీంపట్నం అసెంబ్లీ పరిధిలోని తట్టి అన్నారంలో హౌంమంత్రి మహమూద్‌ అలీ 1268 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.
ఇబ్రహీంపట్నంలోని తిమ్మాయిగూడలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి 600 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.
పటాన్‌చెరువు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు-2లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు 4800 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.
మేడ్చల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని జవహర్‌నగర్‌-3లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి 1200 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.
ఉప్పల్‌ నియోజకవర్గంలోని చర్లపల్లిలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ 1000 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.
మేడ్చల్‌ నియోజకవర్గ పరిధిలోని ప్రతాప సింగారంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ 1100 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.