– హర్షం వ్యక్తం చేసిన సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దుబ్బాక రామచందర్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బుడ్డీరపు శ్రీనివాస్
నవతెలంగాణ-కందుకూరు
ఎర్రజెండా పోరాట ఫలితమే పేద ప్రజలకు ఇండ్ల పట్టాల పంపిణీ చేశారని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దుబ్బాక రామచందర్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బుడ్డీరపు శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఇండ్ల పట్టాల పంపిణీపై మండల కమిటీ సభ్యులు, మండల నాయకులు కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం కందుకూరు మండల కేంద్రంలో కందుకూరు, కొత్తగూడ గ్రామాల్లోని పేద ప్రజలకు ఇండ్ల పట్టాలు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ స్థలాల సర్టిఫికెట్లు సీపీఐ(ఎం) పోరాట ఫలితమేనని ప్రజలకు తెలుసన్నారు. గత 2007 నుంచి నేటి వరకు సీపీఐ(ఎం) పోరాటం చేయడంతోనే ప్రభుత్వం స్పందించి, పేదలకు ఇండ్ల పట్టాలు అందజేసిందన్నారు. 2022 అక్టోబర్ 26న, 788 సర్వే నెంబర్‌లో గుడిసెలు వేసి, రాత్రింబవళ్లు అక్కడే నిద్రలేని రాత్రులు గడిపామని గుర్తు చేశారు. గుట్టల్లో, రాళ్ళల్లో నివాసం ఉంటూ, పాములు, తెళ్లకు భయపడుతూ గుడిసెలు వేసుకుని పోరాటం చేయడం జరిగిందని గుర్తు చేశారు. అంతేకాకుండా పోలీసుల నిర్బంధాన్ని లెక్కచేయకుండా , కేసులకు భయపడకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసినట్టు తెలిపారు. 16 ఏండ్లుగా ప్రజల పక్షాన సీపీఐ(ఎం) అండగా ఉంటూ, మొక్కవోని దీక్షతో ఇండ్ల స్థలాల కోసం పోరాటం చేసిందన్నారు. ఆరు నెలలపాటు అలుపెరుగని గుడిసెల పోరాటం చేయ డంతోనే ఇండ్ల పట్టాల పంపిణీ జరిగిందన్నారు. గతంలో ఇచ్చిన సర్టిఫికెట్లు తొలగించి అదనంగా అధికార పార్టీ వారికి ఇండ్ల స్థలాలు ఇచ్చినట్టు సమాచారం ఉందన్నారు. సర్టిఫికెట్లు ఇచ్చిన అందరికీ స్థలాలు చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.