– పీర్జాదీగూడలో బీఆర్‌ఎస్ నేతల ఎత్తుగడ
– మల్లారెడ్డి కాలేజ్ సిబ్బందిని పట్టుకున్న ఎన్నికల అధికారులు
– డబ్బు తరలిస్తూ పట్టుబడిన పోలీసు అధికారి
– ఓటమి భయంతోనే ప్రలోభాలు : కాంగ్రెస్ పార్టీ నేతలు
నవతెలంగాణ- బోడుప్పల్
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి బీఆర్‌ఎస్ నేతలు కొత్త ఎత్తుగడలను అవలంబిస్తున్నారు. బీఆర్‌ఎస్ నాయకులు ఓటర్లకు ఒక చేతితో డబ్బు పంపిణీ చేస్తూ మరో చేతితో ఓ మత గ్రంథంపై ప్రమాణం చేయిస్తూ.. పట్టుబడ్డారు. ఈ సంఘటన మేడ్చల్ నియోజకవర్గం పీర్జాదీగూడ కార్పొరేషన్‌లో సోమవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. పీర్జాదీగూడ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్‌లో బీఆర్‌ఎస్ నేతలు, మల్లారెడ్డి కాలేజ్ సిబ్బంది ఓటర్ లిస్టు ఆధారంగా ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారు. దాంతోపాటు వారితో బీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తామని ఓ మత గ్రంథంపై ప్రమాణం చేయిస్తున్నారని కాంగ్రెస్ నాయకులకు తెలియడంతో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న ఎన్నికల అధికారులు, పోలీసులు బీఆర్‌ఎస్ నేతలు, మల్లారెడ్డి కళాశాల సిబ్బంది నుంచి రూ.1.50 లక్షలు, మత గ్రంథం, ఓటర్ల లిస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓటర్ల వివరాలతో కూడిన మరో లిస్ట్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఎఫ్‌ఎస్టీ రాధిక తెలిపారు. అనంతరం పట్టుబడిన నగదు, మల్లారెడ్డి కాలేజ్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని మేడిపల్లి పీఎస్‌కు తరలించారు.
రూ.6.50లక్షలు తరలిస్తూ పట్టుబడిన పోలీసు అధికారి
మేడిపల్లి ఎస్వీఎం హోటల్ నుంచి ఓటర్లకు డబ్బు పంపిణీ చేసేందుకు రూ.6.50 లక్షలు కారులో తరలిస్తున్న పోలీసు అధికారిని కాంగ్రెస్ నేతలు అడ్డుకుని మేడిపల్లి చౌరస్తాలోని పోలీసులకు అప్పగించారు. ఆ కారులో పట్టుబడిన నగదును ఎన్నికల అధికారులు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలి
ఎన్నికల్లో అక్రమ పద్ధతిలో గెలిచేందుకు మల్లారెడ్డి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాడని, ఆయనపై ఎన్నికల అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో పీర్జాదీగూడ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసిన మల్లారెడ్డి ప్రలోభాలకు తెరదీశారని చెప్పారు. ఇప్పటికైనా మల్లారెడ్డిపై, కాలేజ్ సిబ్బందిపై చర్యలు తీసుకుని ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్గా సుధాకర్ రెడ్డి, వంగేటి ప్రభాకర్ రెడ్డి, కవిడే కుమార్, భాస్కర్ బండిరాళ్ల, రంజిత్ రెడ్డి, చింత నరసింహారెడ్డి ఉన్నారు.