
– మొక్కలు నాటి వినూత్నంగా మంత్రి సీతక్క పుట్టినరోజు వేడుకలు
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐకెపి సిబ్బంది ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు వనమహోత్సవంలో భాగంగా బుధవారం నుండి 50 లక్షల డ్వాక్రా మహిళలకు ప్రతి ఒక్కరికి ఐదు మొక్కల చొప్పున పంపిణీ చేపట్టబోతున్నట్లు తెలంగాణ సెర్ప్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుంట గంగాధర్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క పుట్టిన రోజును సెర్ప్ ఉద్యోగులు వినూత్నంగా జరుపుకున్నారు. మండల సమాఖ్య కార్యాలయ ఆవరణలో నిర్వహించిన మంత్రి సీతక్క పుట్టినరోజు వేడుకల్లో తెలంగాణ సెర్ప్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుంట గంగాధర్ స్థానిక సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. మంత్రి సీతక్క పుట్టినరోజు సందర్భంగా మండల సెర్ప్ కార్యాలయ ఆవరణలో రావి మొక్కను నాటి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ సెర్ప్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుంట గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి దనసరి సీతక్క ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి పేరుతో మహిళలకు బీమా సౌకర్యం, మహిళా సంఘాలకు రూ.20వేల కోట్ల వరకు రుణాల పంపిణీ, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, మహిళా సంఘాలకు మీసేవ కేంద్రాలు వంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. మంత్రి పుట్టిన రోజును పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు పెరటి మొక్కల పంపిణీ పలుచోట్ల ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రవికుమార్, శ్రీనివాస్, నవీన్, అలేఖ్య, అనసూయ, సత్తెమ్మ, తదితరులు పాల్గొన్నారు.