– బ్యాగు , బెల్ట్ ఇవ్వాలని యోచన
నవతెలంగాణ – అచ్చంపేట
ప్రభుత్వ పాఠశాలను పటిష్ట పరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఇప్పటికే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనము నాలుగు జతల యూనిఫామ్ లు ఉచిత పాఠ్య పుస్తకాలు అమలు చేయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలలో బడి బయట ఉన్న పిల్లలను బడివైపు మన్నించడానికి ప్రభుత్వాలు నూతన విధానాన్ని అమలు చేస్తున్నాయి. అందులో భాగంగానే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు బూట్లు, బ్యాక్ టై బెల్టు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. సమగ్ర శిశు అభియాన్ లో విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదికలు సిద్ధం చేసింది. ఇది అమలు జరిగితే నాగర్కర్నూల్ జిల్లాలో 70 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. ప్రైవేటు పాఠశాలలో డ్రెస్ కోడ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 60 శాతం రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు కేటాయించుకుని వచ్చే విద్యా సంవత్సరంలో నూతన డ్రెస్ కోడ్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు, హై స్కూల్స్ , ఎయిడెడ్ స్కూల్స్ , మొత్తం 848 పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 76 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు బూట్లు, బ్యాగు , బెల్టు, టై లను తల్లిదండ్రులు కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతుంది. ఈ విధానానికి స్వస్తి చెప్పాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా పై వస్తువులను ఇవ్వడానికి ప్రణాళికా సిద్ధం చేస్తుంది. డిసెంబర్ 10 నుంచి జనవరి 11 వరకు విద్యాశాఖ అధికారులు బడి బయట ఉన్న విద్యార్థుల సర్వే నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 310 విద్యార్థులు బడి బయట ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విద్యా సంవత్సరంలో వీరందరినీ పాఠశాలలో చేర్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు జరుగితే జిల్లాలో 70 వేల మంది పైగా విద్యార్థులకు లబ్ధి జరగనుంది.