నవతెలంగాణ డిచ్ పల్లి: తెలంగాణ యూనివర్సిటీ ప్రధాన గ్రంథాలయం (విజ్ఞాన సౌధ)కు పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్య పుస్తకాలు తానా ప్రతినిధులు అందజేశారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), పుస్తకాల ప్రచురణ సంపాదకులు డాక్టర్. తోటకూర ప్రసాద్ తరఫున డీన్, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ప్రొఫెసర్ వి. త్రివేణి, తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.యాదగిరికి రిజిస్ట్రార్ చాంబర్ లో శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ అసంఖ్యాక తెలుగు ప్రజానీకానికి అభిమాన సినీ గీత కవి, గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అని అన్నారు. ఆయన సినీ పాటలు అలనాటి నుంచి వయస్సుతో ప్రమేయం లేకుండా బాలలను, యువతను, వృద్ధులను ఉర్రూతలుగిస్తూనే ఉన్నాయన్నారు. ఆయన రాసిన పాటలను, ఇతర సాహిత్య విషయాలను ఇలా ఆరు సంపుటాలుగా ప్రచురించడం ముదావహం అని అన్నారు. ఇప్పటి వరకు ఎక్కడ, ఎలాంటి సమగ్ర గ్రంథాలుగా ప్రచురణ రూపంలోకి రాలేని సిరివెన్నెల సాహిత్యాన్ని ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక మరియు సిరివెన్నెల కుటుంబ సభ్యులు సంయుక్తంగా ఒక బృహత్ సంకల్పంతో, అకుంఠిత దీక్షతో ఈ కార్యాన్ని సఫలం చేశారని అన్నారు.
మొదటి సంపుటంలో 1986- 92, రెండవ సంపుటంలో 1993-97, మూడవ సంపుటంలో 1998-2002, నాల్గవ సంపుటంలో 2003-2022 కాలాలలో సిరివెన్నెల రాసిన పాటలను; ఐదవ సంపుటంలో, ఆరవ సంపుటంలో సిరివెన్నెల సినీయేతర రచనలను ప్రచురించారని అన్నారు. మొదటి పేజీలోనే ఆనాటి గౌరవ రాష్ట్రపతి శ్రీ రామనాథ్ కోవింద్ నుండి అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ బిరుదును పొందుతున్న చాయా చిత్రం, పద్మశ్రీ సర్టిఫికేట్ చూపరులకు ఎంతో స్ఫూర్తిని అందిస్తుందని అన్నారు. ఈ పుస్తకాలతో సిరివెన్నెల, సిరివెన్నెల సాహిత్యం శాశ్వతంగా, సజీవంగా నిలిచి పదికాలాల పాటు వెలుగొందుతాయని అన్నారు. సృజనాత్మక సామర్థ్యం, కళాత్మక అభినివేశం, సంగీత ప్రావీణ్యం, సాహిత్య పరిజ్ఞానం గల విద్యార్థులెందరికో ఈ పుస్తకాలు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. ఈ పుస్తకాలు మన తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రధాన గ్రంథాలయం (విజ్ఞాన సౌధ)లో అందుబాటులో ఉంటాయని అన్నారు. అపురూపమైన, అమూల్యమైన సిరివెన్నెల గ్రంథాలను అందించిన గౌరవ సంపాదకులు డా. తోటకూర ప్రసాద్, ప్రధాన సంపాదకులు శ్రీ కిరణ్ ప్రభ, తానా అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి లావు లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సిహెచ్. ఆరతి, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ప్రొఫెసర్ వి. త్రివేణి, యూజీసీ డైరెక్టర్ ప్రొఫెసర్ సిహెచ్. ఆంజనేయులు, పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె. సంపత్ కుమార్, ఎన్ ఎస్ ఎస్ కో – ఆర్డినేటర్ ప్రొఫెసర్ కె. రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.