నవతెలంగాణ-నిర్మల్
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీకి తీసుకుంటున్న చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఏకరూప దుస్తుల పంపిణీకి జిల్లాలో అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా తరగతుల వారీగా జూన్ 12న ప్రతి విద్యార్థికి ఉచితంగా జత ఏకరూప దుస్తులు, పాఠ్య, నోటు పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 52,264 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్నారని అందులో బాలికలు 28,319, బాలురు 23,945 మంది ఉన్నారని తెలిపారు. ఇప్పటికే మండలాల వారీగా ఏకరూప దుస్తుల క్లాత్‌ను పంపిణీ చేయడం జరిగిందని, మున్సిపాలిటీలలో మెప్మా, గ్రామీణ ప్రాంతాలలో డీఆర్డిఓ ఆధ్వర్యంలో ఎస్‌హెచ్‌జీ మహిళలతో దుస్తులను కుట్టించడం జరుగుతున్నదని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు స్టిచ్చింగ్ సెంటర్లను పర్యవేక్షించి, రిపోర్టులను అందజేయాలని సూచించారు. అనంతరం పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటివరకు స్టిచ్చింగ్ సెంటర్లు, కుట్టిన దుస్తుల సంఖ్య ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు. సమావేశంలో ఆర్డీఓ రత్నకల్యాణి, డీఈఓ రవీందర్‌రెడ్డి, డీఆర్డీఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ గోవింద్, డీపీఓ శ్రీనివాస్, సీపీఓ బాబురావు, సంక్షేమ శాఖల అధికారులు రాజేశ్వర్‌గౌడ్, మనోహర్, మెప్మా పీడీ సుభాష్, అధికారులు, ఎంఈఓలు, ఎపీఎం పాల్గొన్నారు.