రేపు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకోనున్న జిల్లా అభ్యర్థులు

– జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే
నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
బుధవారం నాడు సాయంత్రం 4.00 గంటలకు లాల్ బహదూర్ స్టేడియంలో  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పోలీస్ కానిస్టేబుల్, ఎక్సైజ్, అగ్ని మాపక, రవాణా, జైళ్లు శాఖలకు సంబంధించి జిల్లాకు చెందిన 438 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామకపత్రాలను అందజేయనున్న నేపథ్యంలో, వీరందరిని రేపు ఉదయం 9.00 గంటలకు భువనగిరి జూనియర్ కాలేజీ నుండి పది బస్సులలో హైదరాబాద్ పంపేందుకు, తగిన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే తెలిపారు. మంగళవారం నాడు కాన్ఫరెన్స్ హలులో అయన డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర,  జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి వీరారెడ్డి,  జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి,  జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి,  జిల్లా ఎక్సైజ్ అధికారి నవీన్ కుమార్,  జిల్లా ఫైర్ ఆఫీసర్ జయకృష్ణ, అధికారులతో సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు. అభ్యర్థులు వెళ్లి, వచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.