జిల్లా సహకార సంఘం సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ విచారణ

నవతెలంగాణ – ముత్తారం
ముత్తారం మండల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గత ఐదు సంవత్సరాలుగా సుతిలి కొనుగోలు పేరిట కోట్లాది రూపాయల కుంభ కోణం జరిగిందని, దీనిపై విచారణ చేపట్టాలని హైదరాబాద్‌ ఎన్ఫోర్స్మెంట్‌ డైరెక్టర్‌ (ఇడి)కి కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఈ మేరకు జిల్లా సహకార సంఘం సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ మహమ్మద్‌ ముసాసిర్‌ హైమద్‌ గురువారం విచారణ చేపట్టారు. ఈ మేరకు ఆయన తనిఖీలు నిర్వహించి, పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య మాట్లాడుతూ ముత్తారం మండలంలో సివిల్‌ సప్లై, సహకార శాఖ, మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి దాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని, దాన్యం కొనుగోలు కేంద్రాలకు గన్నీ సంచులను ప్రభుత్వం ఆధ్వర్యంలోని సివిల్‌ సప్లై శాఖ సరపరా చేస్తుండగా, వాటిని కుట్టడానికి అవసరమైన సుతిలి దారాలు మాత్రం ఆయా కొనుగోలు కేంద్రాల వారే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. అయితే ప్రతి ఖరీఫ్‌, రబీ సీజన్లో సహకార శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కొన్ని సింగిల్‌ విండో సొసైటీల్లో గత కొన్ని సంవత్సరాలుగా కేవలం సుతిలి దారాల ఖర్చు లక్షల్లో రాస్తూ ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారని, ముత్తారం సింగిల్‌ విండో సొసైటీలో ఏకంగా ప్రతి సీజన్లో లక్షల్లో కేవలం సుతిలి దారాల, వాటర్‌ బిల్లు, ల్యాండ్‌ రెంట్‌ పేరిట, ఆఫీస్‌ మెయింటెనెన్స్‌ ఖర్చుల కింద రాస్తున్నారంటే ప్రభుత్వ నిధులు ఏవిధంగా పక్కదారి పడుతున్నాయో అర్థమవుతుందని తెలిపారు. గత మూడు ఏండ్లుగా సుతిలి కొనుగోలు పేరిట కోట్లాది రూపాయల కుంభకోణం జరిగినట్టుగా ఆయన ఆరోపించారు. ముత్తారం (మంథని) సహకార సంఘం నుండి సరఫరా అయిన ఎరువులను, పురుగుల మందులను ప్రయివేట్‌ వ్యాపారులకు అక్రమంగా అమ్ముకొని రైతుల పేరిట తప్పుడు బిల్లులు సఅష్టించారని ఆరోపించారు. ముత్తారం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరిగిన సుతిలి, వాటర్‌ బిల్లు, ల్యాండ్‌ రెంట్‌ పేరిట, ఆఫీస్‌ మెయింటెనెన్స్‌ ఖర్చుల కొనుగోలు కుంభకోణంపై విచారణ ప్రారంభించారని తెలిపారు. ఈ సీజన్లో గన్నీ సంచుల తరహాలోనే సుతిలి కూడా సివిల్‌ సప్లైశాఖ అధ్వర్యంలో సరఫరా జరిగేట్టు చర్యలు తీసుకోవాలని, ఎవరూ కూడా బయట మార్కెట్లో సుతిలి కొనుగోలు చేయకుండా తగు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సహకారంతో చైర్మన్‌ గుజ్జుల రాజిరెడ్డిపై అవిశ్వాసం పెట్టి నెగ్గామని, కాంగ్రెస్‌పార్టీకి చెందిన అల్లాడి యాదగిరి రావును చైర్మన్‌గా గెలిపించుకోవడం జరిగిందని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మంత్రి శ్రీధర్‌బాబు నాయకత్వంలో ఆయన పూర్తి పారదర్శకంగా కృషి చేస్తున్నారని అన్నారు. రైతు సమస్యల పరిష్కారం, ప్రాథమిక వ్యసాయ సహకార సంఘం పరిధిలోని సమస్యలన్నింటిని పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.